Home > ఆంధ్రప్రదేశ్ > పండుగ వేళ విషాదం.. ముగ్గులు వేస్తున్న అక్కాచెల్లెళ్లపైకి దూసుకొచ్చిన లారీ

పండుగ వేళ విషాదం.. ముగ్గులు వేస్తున్న అక్కాచెల్లెళ్లపైకి దూసుకొచ్చిన లారీ

పండుగ వేళ విషాదం.. ముగ్గులు వేస్తున్న అక్కాచెల్లెళ్లపైకి దూసుకొచ్చిన లారీ
X

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ భోగి పండుగను పురస్కరించుకుని ప్రజలంతా తెల్లవారుజామునే భోగి మంటలు వేసుకుని మంటల చుట్టూ ఆడిపాడుతున్నారు. మరోవైపు మహిళలంతా వేకువజామునే వాకిట్లో రంగు రంగుల రంగవళ్లులు తీర్చిదిద్దుతున్నారు. ఈ క్రమంలో ఏపీలోని ఏలూరు జిల్లా మండవల్లి మండలం కానుకొల్లులో విషాదం చోటుచేసుకుంది. భోగి పండుగ సందర్భంగా వాకింట్లో ముగ్గులు వేస్తున్న వారిపై లారీ దూసుకొచ్చింది. ఇంటి ముందు ముగ్గులేస్తున్న అక్కా చెల్లెళ్లపై లారీ దూసుకు రావడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు.

గ్రామానికి చెందిన పంగిళ్ల నాగబాబు కుమార్తెలు రోడ్డు పక్కనే ఉన్న తమ ఇంటి ముందు సంక్రాంతి ముగ్గులు వేస్తున్నారు. అదే సమయంలో గుడివాడ నుంచి కైకలూరు వైపు వెళ్తున్న ఇటుకల లారీ వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తేజస్విని (18) దుర్మరణం పాలవగా.. పల్లవీ దుర్గకు (16) గాయాలయ్యాయి. బాధితురాలిని గుడివాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లారీ డ్రైవర్‌ను ప్రకాశ్‌రావుగా గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాగబాబు కుమార్తె మృతితో పెద్ద సంఖ్యలో గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని గ్రామస్థులతో కలిసి జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. తేజస్విని, పల్లవీ దుర్గ ముదినేపల్లిలోని ఓ కళాశాలలో ఇంటర్‌ చదువుతున్నారు.

మరోవైపు తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం కలగుంట వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. కలగుంట జాతీయ రహదారిపై బైక్ను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో ముగ్గురు యువకులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మునిరాజా(24), రాంకీ(25), గౌతమ్‌(23) మరణించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated : 14 Jan 2024 11:19 AM IST
Tags:    
Next Story
Share it
Top