పెళ్లింట విషాదం..వడదెబ్బతో వరుడు మృతి
X
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో విషాదం నెలకొంది. కొద్ది గంటల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన వరుడు కాస్త మండపంలోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వడదెబ్బ తగలడంతో పెళ్లి కొడుకు కన్నుమూశాడు. దీంతో బాజాభజంత్రీలు మోగాల్సిన చోట విషాదఛాయలు నెలకొన్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర దుఖంలో మునిగిపోయారు.
జిల్లాలోని గుడ్లబోరి గ్రామానికి చెందిన గుండ్ల శ్యాంరావ్,యశోద దంపతుల 32 ఏళ్ల కుమారుడు తిరుపతికి, మంచిర్యాల జిల్లాకు చెందిన అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయ్యింది. బుధవారం రోజు స్వగ్రామంలో పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు వరుడు తరపువారు. పెళ్లి పనుల్లో మునిగిపోయిన తిరుపతి వడదెబ్బ తగలడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చూపించారు. అయినప్పటికీ ఎలాంటి మార్పు లేకపోవడంతో మెరుగైన చికిత్స నిమిత్తం కాగజ్‌నగర్‌లోని ఓ ఆస్పత్రికి తిరుపతిని తరలించారు. మంగళవారం అర్ధరాత్రి ఆరోగ్యం మరింత క్షీణించడంతో లాభంలేదనుకుని మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయినప్పటికీ పరిస్థితిలో మార్పు కనిపించలేదు. బుధవారం తెల్లవారుజామున తిరుపతి మృతి చెందాడు. శుభకార్యం జరగాల్సిన ఇంట కొడుకు విగతజీవిగా కనిపించడంతో తిరుపతి తల్లిదండ్రలు తల్లడిల్లుతున్నారు.