రెండేళ్ల చిన్నారి ప్రాణం తీసిన పల్లి గింజ
X
అప్పుడప్పుడు తినే ఆహారం కూడా ప్రాణాంతకంగా మారుతుంది. ఇంట్లోనివారి ఏమరపాటు ఓ చిన్నారి ప్రాణం మీదకు తెస్తుంది. అలాంటి ఘటనే ఒకటి ఉమ్మడి అనంతపురం జిల్లాలో జరిగింది. ఓ రెండేళ్ల చిన్నారి పల్లీ గింజలు తింటుండగా ఆవి గొంతులో ఇరుక్కొని ఊరిరాడక మృతి చెందింది. దీంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
శ్రీసత్యసాయి జిల్లా నల్లచెరువులో ఈ విషాదకర సంఘటన జరిగింది. కర్ణాటక రాష్ట్రం బాగేపల్లిలోని వసంతపూర్కు చెందిన హనుమంతు ఫ్యామిలీ నల్లచెరువులో ఉండే తమ బంధువుల ఇంటికి వచ్చారు. చుట్టాల రాకతో ఇళ్లు సందడిగా మారింది. కుటుంబ సభ్యులంతా ఒకరితో ఒకరు మాటల్లో మునిగిపోయారు. ఈ క్రమంలో హనుమంతు రెండేళ్ల కూతురు నయనశ్రీ ఆడుకుంటూ అక్కడే ఉన్న వేరుశేనగ విత్తనాన్ని తినేందుకు ప్రయత్నించింది. ఈ విత్తనాన్ని నోట్లో పెట్టుకుంది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు ఎవరూ గమనించలేదు. దీంతో చిన్నారి గొంతులో పల్లీ విత్తనం ఇరుక్కుపోయింది. ఊపిరాడక చాలా సేపు నయనశ్రీ విలవిల్లాడింది. చిన్నారికి ఏమైందో అర్థం కాక కుటుంబ సభ్యులంతా టెన్షన్ పడ్డారు. దీంతో హుటాహుటిన కదిరిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి పాపను తీసుకెళ్లారు. పాప పరిస్థితి విషమంగా ఉండటంతో గవర్నమెంటు ఆస్పత్రికి తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు సూచించారు. అయితే పాపను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించే క్రమంలోనే మార్గమధ్యలోనే ప్రాణాలను విడిచింది. పాపను చూసిన వైద్యులు చిన్నారి మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో ఈ ఘటన కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.