TSRTC BUS : ఏపీలో ఘోర ప్రమాదం.. లారీని ఢీకొన్న TSRTC బస్సు
X
ఏపీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తెలంగాణ ఆర్టీసీ బస్సు లారీని ఢీకొట్టింది. దీంతో ఇద్దరు మృతి చెందారు. నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం మోచర్ల దగ్గర జాతీయ రహదారిపై తెల్లవారుజామున ముందు వెళ్తున్న ధాన్యం లోడు లారీని తెలంగాణ ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం నుజ్జు నుజ్జు కాగా, డ్రైవర్ వినోద్ (45) అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మరో ఏడుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను తొలుత కావలి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం నెల్లూరుకు తీసుకెళ్లారు. వీరిలో సీతమ్మ (65) అనే వృద్ధురాలు చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి కేసు నమోదు చేశారు. టీఎస్‌ఆర్టీసీ బస్సు మిర్యాలగూడ నుంచి తిరుపతికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఆర్టీసీ డ్రైవర్ వినోద్ నిద్రమత్తు కారణంగా ఈ సంఘటన చోటు చేసుకుందని సమాచారం అందుతోంది. ఇక దీనిపై కేసు దర్యాప్తు చేసి విచారిస్తున్నారు గుడ్లూరు పోలీసులు.