తిరుమల నడక దారిలో వాటి అమ్మకాలు బంద్..
X
తిరుమల అలిపిరి నడక దారిలో వన్యమృగాల దాడులను అరికట్టడానికి టీటీడీ నడుం బిగించింది. చేతికర్రలు అందించడంతోపాటు అవాంఛనీయ సంఘటలు జరగకుండా మరికొన్ని చర్యలు కూడా తీసుకుంటోంది. నడక మార్గంలోని దుకాణాల్లో పండ్లు, కూరగాయాలు విక్రయించకూడదని వ్యాపారులను ఆదేశించింది. భక్తులు వాటిని కొని కోతులు, ఇతర సాధు జంతువులకు తినిపించడం వల్ల అవి ఎక్కువ సంఖ్యలో వస్తున్నాయని, వాటి కోసం పులులు కూడా రావడంతో సమస్య తలెత్తుతోందని టీటీడీ అధికారులు భావిస్తున్నారు. శుక్రవారం ఈవో ధర్మారెడ్డి దుకాణాల యజమానులతో సమావేశ నిర్వహించి పలు సూచనలు చేశారు. క్రూరమృగాలు కనిపిస్తే అధికారులకు సమాచారం తెలిపేందుకు అటవీ, ఆరోగ్య, విజిలెన్స్ అధికారుల ఫోన్ నంబర్లను బోర్డులపై ప్రదర్శిస్తామని చెప్పారు. నడక దారిలో భక్తుల భద్రత కోసం అన్ని చర్యలూ తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. పారిశుద్ధ్యాన్ని కూడా మెరుగుపరుస్తున్నామన్న ఆయన దుకాణాల దగ్గర తడి చెత్తను, పొడి చెత్తను వేరువేరుగా పడేయడానికి రెండు డబ్బులు పెట్టుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
అలిపిరి నడక దారిలో చిరుత పులులు, ఎలుగుబంట్లు కనిపిస్తుండడంతో భక్తులు హడలిపోతున్న సంగతి తెలిసిందే. దాడుల కారణంగా ఆ మార్గంలో వెళ్లే భక్తుల సంఖ్య కూడా తగ్గింది. ఇదివరకు రోజుకు 12 వేల మంది వెళ్తుండగా ఇప్పుడు ఎనిమిదివేల మంది మాత్రమే పోతున్నారు. నెల కిందట ఓ చిరుత కౌషిక్ అనే బాలుడిపై దాడి చేయగా, ఇటీవల లక్షిత అనే చిన్నారిని మరో చిరుత చంపేసింది. చిరుతపులులను బంధించి దూర ప్రాంతాలకు తరలించడానికి టీటీడీ బోన్లను ఏర్పాటు చేయగా నెల వ్యవధిలోనే రెండు దొరికాయి.