కాలినడకన వెళ్లే ప్రతీ భక్తుడికి ఒక చేతికర్ర..
X
తిరుమలలో చిరుత పులుల సంచారం ఆందోళన రేకెత్తిస్తోంది. చిన్నారిపై చిరుత దాడి చేసి చంపేయడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. భక్తుల భద్రతపై కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ మేరకు టీటీడీ నూతన చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన హైలెవల్ కమిటీ సమావేశం నిర్వహించారు. నడక దారిలో చిరుత దాడి దృష్ట్యా చేపట్టాల్సిన చర్యలు, ఘాట్ రోడ్లలో ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. సమావేశం అనంతరం భూమన మీడియాతో మాట్లాడారు.
" నడకదారిలో భక్తులు అప్రమత్తంగా ఉండాలి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నడకదారిలో పిల్లలకు అనుమతి ఉంటుంది. మధ్యాహ్నం రెండు గంటల తరువాత పిల్లలను అనుమతించం. కాలిబాటలో రాత్రి 10 గంటల వరకు పెద్దవాళ్లకు అనుమతి. కాలినడకన వెళ్లే ప్రతి భక్తుడికి చేతి కర్ర ఇస్తాం. కర్రే ఇక భక్తులకు ప్రధాన ఆయుధం. భక్తుల భద్రత కోసం ఫారెస్ట్ సిబ్బందిని సెక్యూరిటీగా నియమిస్తాం. వన్యప్రాణులకు భక్తులు ఆహారం పెట్టకూడదు" అని భూమన తెలిపారు.
భద్రత కోసం డ్రోన్లు కూడా వాడాలని నిర్ణయించామని భూమన తెలిపారు. తిరుపతి నుంచి తిరుమల మధ్య 500 కెమెరాల ఏర్పాటు చేస్తామన్నారు. నడకదారిలో ఇరువైపులా లైటింగ్ ఏర్పాటు చేయడంతో పాటు భక్తులను అప్రమత్తం చేసేలా సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బేస్ క్యాంప్‌తో పాటు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తామని భూమన చెప్పారు.
కేంద్ర అటవీశాఖ అద్యాయనం చేసి తర్వాత ఫెన్సింగ్ గురించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. తిరుమలలో దుకాణాలు వ్యర్థాలు బయటే వదిలేసే షాపులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. "కాలినడకన వెళ్లే వారికి గతంలో నేను చైర్మన్ గా ఉన్న సందర్భంగా దర్శన టికెట్లు కేటాయించాం. 15 వేల మందికి ప్రస్తుతం నడకదారి భక్తులకు టోకెన్లు ఇస్తున్నాము, వాటిని గాలిగోపురం వద్ద చెక్ చేసుకోవాలి. ఇకపై భూదేవి కాంప్లెక్స్ లో ఇచ్చే దర్శన టికెట్లు గాలిగోపురం వద్ద చెకింగ్ అవసరం లేదు" అని భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు