Home > ఆంధ్రప్రదేశ్ > తిరుమలలో చిరుత దాడి.. చిన్నారి కుటుంబానికి 10లక్షల సాయం

తిరుమలలో చిరుత దాడి.. చిన్నారి కుటుంబానికి 10లక్షల సాయం

తిరుమలలో చిరుత దాడి.. చిన్నారి కుటుంబానికి 10లక్షల సాయం
X

తిరుమలలో చిరుత దాడిలో మృతి చెందిన చిన్నారి కుటుంబానికి అండగా ఉంటామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. చిన్నారి కుటుంబానికి 10లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. టీటీడీ తరుపున 5లక్షలు, అటవీశాఖ తరుపున 5లక్షలు అందిస్తామని చెప్పారు. ఘటనాస్థలాన్ని అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. భక్తుల భద్రతా విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని భూమన స్పష్టం చేశారు.





అటవీ సంరక్షణ చట్టాలు సమర్థంగా అమలు జరుగుతున్నందువల్ల వన్య ప్రాణుల సంఖ్య కూడా పెరిగిందన్న భూమన.. భక్తులు వాటి బారిన పడకుండా ఎలా రక్షించాలనేదే తమకు ప్రధాన అంశమన్నారు. ఈ ఘటనలో ఎవరి నిర్లక్ష్యం లేదన్న ఆయన.. చిన్నారి తప్పిపోయిన వెంటనే గాలింపు చేపట్టామన్నారు. చిన్నపిల్లలతో తిరుమలకు వచ్చే భక్తులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మరోవైపు కాలినడక మార్గంలో ప్రతి 10మీటర్లకో సెక్యూరిటీ గార్డ్ నియమిస్తామని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. అదేవిధంగా కాలనడక మార్గాన్ని సాయంత్రం 6గంట తర్వాత మూసివేసే అంశంపై టీటీడీ చైర్మన్, అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అలిపిరిలో శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు చిన్నారి తప్పిపోయిందన్నారు. పాప ఆచూకీ కోసం సుమారు 70 మంది సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అయితే సీసీ కెమెరాల్లో చిరుత కన్పించలేదని.. చిన్నారే అటవీ ప్రాంతంలోకి వెళ్లిందా అనే కోణంలో విచారిస్తున్నట్లు చెప్పారు.

ఏం జరిగిందంటే..?

నెల్లూరు జిల్లాకు చెందిన ఓ కుటుంబం శుక్రవారం సాయంత్రం నడక మార్గంలో తిరుమల కొండపైకి బయలు దేరింది. కాలినడకన తిరుమలకు వస్తున్న క్రమంలో ఆరేళ్ల చిన్నారి తప్పిపోయింది. శనివారం ఉదయం నరసింహ స్వామి ఆలయం వద్ద చెట్ల పొదల్లో చిన్నారి మృతదేహం లభించింది. చిరుత దాడి చేయడంతోనే చిన్నారి మృతిచెందినట్లు తెలుస్తోంది. అయితే పాప మృతదేహానికి పోస్టుమార్టం పూర్తైన అనంతరం ఏ జంతువు దాడి చేసిందన్నదానిపై స్పష్టత వచ్చే అవకాశముంది.


Updated : 12 Aug 2023 7:58 PM IST
Tags:    
Next Story
Share it
Top