తిరుమల కాలినడక దారిలో ప్రతి 10 మీటర్లకో సెక్యూరిటీ గార్డు : టీటీడీ ఈవో
X
చిరుత దాడిలో ఆరేళ్ల చిన్నారి మృతి చెందిన నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. కాలినడక మార్గంలో ప్రతి 10మీటర్లకో సెక్యూరిటీ గార్డ్ నియమిస్తామని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. అదేవిధంగా కాలనడక మార్గాన్ని సాయంత్రం 6గంట తర్వాత మూసివేసే అంశంపై టీటీడీ చైర్మన్, అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కాగా ఈ ఘటనపై అటవీ, పోలీస్ అధికారులతో ఈవో సమావేశమయ్యారు.
కాలినడక మార్గంలో లక్షిత అనే చిన్నారి మృతి చెందడం బాధాకరమని ఈవో అన్నారు. అలిపిరిలో శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు చిన్నారి తప్పిపోయిందన్నారు. పాప ఆచూకీ కోసం సుమారు 70 మంది సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అయితే సీసీ కెమెరాల్లో చిరుత కన్పించలేదని.. చిన్నారే అటవీ ప్రాంతంలోకి వెళ్లిందా అనే కోణంలో విచారిస్తున్నట్లు చెప్పారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రత్తంగా ఉండాలని సూచించారు.
ఏం జరిగిందంటే..?
నెల్లూరు జిల్లాకు చెందిన ఓ కుటుంబం శుక్రవారం సాయంత్రం నడక మార్గంలో తిరుమల కొండపైకి బయలు దేరింది. కాలినడకన తిరుమలకు వస్తున్న క్రమంలో ఆరేళ్ల చిన్నారి తప్పిపోయింది. శనివారం ఉదయం నరసింహ స్వామి ఆలయం వద్ద చెట్ల పొదల్లో చిన్నారి మృతదేహం లభించింది. చిరుత దాడి చేయడంతోనే చిన్నారి మృతిచెందినట్లు తెలుస్తోంది. అయితే పాప మృతదేహానికి పోస్టుమార్టం పూర్తైన అనంతరం ఏ జంతువు దాడి చేసిందన్నదానిపై స్పష్టత వచ్చే అవకాశముంది.