శ్రీవాణి ట్రస్టు నిధులతో 2,445 కొత్త ఆలయాలు.. తిరుమలలో కొత్తగా లడ్డూ కౌంటర్లు
X
శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది. స్వామివారిని దర్శించుకునే భక్తుల సౌకర్యార్ధం కొరకు టీటీడీ పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు తిరుమల అన్నమయ్య భవనంలో జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం అనంతరం నిర్ణయాలను ప్రకటించారు.
తిరుమలలో రూ. 4 కోట్లతో అదనపు లడ్డూ కౌంటర్ల నిర్మించనున్నట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. రూ. 1.28 కోట్లతో వసతి గృహాల ఆధునీకరించడంతో పాటు రూ. 40.50 కోట్లతో మూడేండ్ల పాటు వ్యర్థాల నిర్వహణను ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించినట్లు ప్రకటించారు. ఇక ఒంటిమిట్టలో దాతల సాయంతో రూ.4 కోట్లతో కొత్త అన్నదాన భవన నిర్మాణానికి పాలక మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శ్రీవాణి ట్రస్టు నిధులతో 2,445 కొత్త ఆలయాలు నిర్మించనున్నట్లు ప్రకటించారు. శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగంపై అసత్య ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించారు.
తిరుమలలో రూ.3.55 కోట్లతో పోలీసు క్వార్టర్స్ ఆధునీకీకరణ చేపట్టనున్నట్లు టీటీడీ ప్రకటించింది. శ్రీవెంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీలో రూ.5 కోట్లతో హాస్టల్ వసతి, రూ.9.5 కోట్లతో టీటీడీ పరిపాలన భవనంలో సెంట్రలైజ్డ్ రికార్డు రూమ్ నిర్మాణానికి ధర్మకర్తలు ఆమోదం తెలిపారు. వీటితో పాటు రూ.97 కోట్లతో స్విమ్స్ ఆస్పత్రి ఆధునీకీకరణ, రూ.29.50 కోట్లతో ఎఫ్ఎంఎస్‌కు కేటాయిస్తున్నట్లు వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు.