తిరుమల నడకదారిలో పిల్లల ఎంట్రీపై టీటీడీ కీలక నిర్ణయం
X
చిరుత దాడిలో ఆరేళ్ల చిన్నారి మృతి చెందిన నేపథ్యంలో టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కాలినడక మార్గంలో మధ్యాహ్నం 2 గంటల తర్వాత 15ఏళ్లలోపు పిల్లలకు అనుమతి నిలిపివేస్తున్నట్లు తెలిపింది. నడకదారిలో పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇవాళ నడకదారిలో వచ్చే పిల్లలకు పోలీసులు ట్యాగులు వేశారు. తల్లితండ్రుల నుంచి పిల్లలు తప్పిపోతే కనిపెట్టేందుకు ఈ ట్యాగులను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
ట్యాగ్పై పేరు తల్లిదండ్రుల వివరాలు ఫోన్ నంబర్ ఉంటాయి. వీటి ఆధారంగా పోలీసులు తప్పిపోయిన పిల్లల తల్లిదండ్రులను గుర్తిస్తారు. కాగా తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో నెల రోజుల వ్యవధిలో రెండు సార్లు చిరుతల దాడి జరిగింది. కొద్దిరోజుల క్రితం నాలుగేళ్ల చిన్నారి కౌశిక్‌ను పులి ఎత్తుకెళ్లగా స్థానికులంతా కలిసి కాపాడారు. శనివారం మాత్రం ఆరేళ్ల లక్షిత చిరుత పంజాకి బలైంది. వరుసగా జరుగుతున్న సంఘటనలతో శ్రీవారి భక్తుల్లో ఆందోళన నెలకొంది.
మరోవైపు దాడి చేసిన చిరుతను పట్టుకునేందుకు చేపట్టిన ఆపరేషన్ చిరుతను అధికారులు ముమ్మరం చేశారు. దాన్ని పట్టుకునేందుకు దాడి చేసిన ప్రాంతంలో రెండు బోన్లు ఏర్పాటు చేశారు. మరోవైపు ట్రాప్ కెమెరాలతో చిరుత కదలికలను అధికారులు పర్యవేక్షిస్తున్నారు.ఇదిలా ఉంటే తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని 35వ మలుపు వద్ద చిరుత కదలికలను అధికారులు గుర్తించారు. దీంతో సైరన్ వేసి చిరుతను విజిలెన్స్ సిబ్బంది దాన్ని అడవిలోకి తరిమేశారు.