Tirumala : శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో స్పెషల్ దర్శనం టికెట్లు రిలీజ్
X
తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి భక్తులకు అలర్ట్ ఇచ్చింది. 2024 ఏప్రిల్ నెలకు సంబంధించి స్పెషల్ దర్శనం టికెట్లను ఇవాళ విడుదల చేయనుంది. ఉదయం 10గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విడుదల చేస్తున్నట్లు టీటీడీ చెప్పింది. మధ్యాహ్నం 3 గంటలకు ఏప్రిల్ నెల గదుల కోటాను విడుదల చేస్తామని తెలిపింది. భక్తులు ఆన్ లైన్లో టికెట్లు బుక్ చేసుకోవడానికి తమ అధికారిక వెబ్ సైట్ https://ttdevasthanams.ap.gov.in ను సందర్శించాలని టీటీడీ సూచించింది.
ఇక ఏప్రిల్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ ఇప్పటికే విడుదల చేసింది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన తదితర ఆర్జిత సేవల ఆన్ లైన్ టికెట్లను ఈ నెల 18 నుంచి 20 వరకు అందుబాటులో ఉంచింది. ఇక శ్రీవారి కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవా టికెట్లను జనవరి 22 ఉదయం 10 గంటలకు విడుదల చేయగా.. వర్చువల్ సేవా టికెట్లను జనవరి 22 మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేసింది. ఏప్రిల్ 21 నుంచి 23 వరకు శ్రీవారి వార్షిక వసంతోత్సవం జరగనుండగా.. దానికి సంబంధించిన సేవా టికెట్లను జనవరి 22 ఉదయం 10గంటలకు టీటీడీ విడుదల చేసింది.