CM Jagan : ఏపీలో వర్సిటీ కులపతిగా ముఖ్యమంత్రి జగన్
X
ఏపీలోని ఓ విశ్వవిద్యాలయానికి సీఎం జగన్ చాన్సలర్‌గా నియమించారు. యూనివర్సిటీలకు సాధారణంగా గవర్నర్లు కులపతులుగా వ్యవహరిస్తారన్న విషయం తెలిసిందే. అయితే, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌లో అక్కడి గవర్నర్లు, ప్రభుత్వాలకూ మధ్య విభేదాలు తలెత్తడంతో అన్ని వర్సిటీలకు సీఎంలే ఛాన్సలర్లుగా ఉండేలా చట్టానికి సవరణలు చేశారు. ప్రస్తుతం రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్‌జీయూకేటీ) ఛాన్సలర్‌గా సీఎం వ్యవహరించేలా రాష్ట్ర సర్కార్ ప్రవేశపెట్టిన బిల్లుకు శాసన సభ ఆమోదం తెలిపింది. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ట్రిపుల్ ఐటీల కోసం ఏర్పాట చేసిన ఆర్‌జీయూకేటీకి ముఖ్యమంత్రి కులపతిగా ఉండేలా చట్టాన్ని సవరించారు.
అయితే, ఏకంగా సీఎం కులపతిగా ఉండటంతో యూనివర్సిటీ వ్యవహారాలపై రాజకీయ ప్రభావాలు ఉండొచ్చన ఆందోళన వ్యక్తమవుతోంది. ఆర్‌జీయూకేటీ ఆరేళ్ల ఇంజినీరింగ్ కోర్సును అందిస్తుంది. గవర్నర్ కులపతిగా ఉంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నుంచి నిధులు వచ్చేందుకు ఎలాంటి ఆటంకాలూ ఉండవని, సీఎం కులపతిగా ఉంటే యూజీసీ నిధులు వచ్చేందుకు సమస్య ఏర్పడుతుందని విద్యావేత్తలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యమంత్రి కులపతిగా ఉండడం వల్ల వర్సిటీల్లోనూ రాజకీయ కార్యకలాపాలు, ఉన్నతాధికారుల పెత్తనం పెరిగిపోతుందనే రాజకీయ పార్టీలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉపకులపతులు డమ్మీగా మారితే వర్సిటీ ప్రతిభ మసకబారుతుందని విద్యార్ధి సంఘా నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్ సర్కారు గత నాలుగున్నరేళ్లల్లో ఈ వర్సిటీకి వైస్ ఛాన్స్‌లర్‌ని నియమించలేదు.