Home > ఆంధ్రప్రదేశ్ > Vaishnava Temples : తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు

Vaishnava Temples : తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు

Vaishnava Temples : తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు
X

వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ రోజు శ్రీ మాహావిష్ణువుని పూజిస్తే అమ్మ లక్ష్మీదేవి అనుగ్రహం కూడా సిద్ధిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. కష్టాలు దూరమై, సంపదతో పాటూ సంతోషాలు వెల్లివిరుస్తాయని భక్తులు వేంకటేశ్వర స్వామి, విష్ణు ఆలయాలకు, రామాలయాలకు క్యూ కడుతున్నారు. భక్తులు శుక్రవారం అర్ధరాత్రి నుంచే ఆలయాలకు పోటెత్తారు. వాస్తవానికి శుక్రవారమే తిథి వచ్చినా.. డిసెంబరు 23 శనివారం రోజు వైకంఠ ఏకాదశి ఉదయం 7 గంటల 56 నిముషాల వరకు ఉంది. కొన్ని ఆలయాల్లో శుక్రవారం సాయంత్రం నుంచే ఉత్తర ద్వార దర్శనభాగ్యం కల్పిస్తున్నారు.

తిరుమలలో శనివారం తెల్లవారుజామున 1.45 గంటలకు వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి మాజీ సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రవీంద్ర బాబు, ఏపీ మంత్రులు తరలి వచ్చారు. మరోవైపు తెలంగాణలోని ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామున 2.30 గంటలకు స్వామివారి మూల విరాట్లకు మహా క్షీరాభిషేకం నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం, భద్రాద్రి రామాలయం, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాల్లో భక్తులకు స్వామివారు ఉత్తర ద్వార దర్శనమిస్తున్నారు.

ఏకాదశి హిందువులకు చాలా పవిత్రమైనది. శుద్ధ ఏకాదశి, బహుళ ఏకాదశి అంటూ నెలకు రెండుసార్లు చొప్పున సంవత్సర కాలంలో ఏకాదశి తిథి 24 సార్లు వస్తుంది. అధికమాసం వస్తే మరో రెండుసార్లు కలిపి 26 సార్లు వస్తుంది. అయితే వీటిలో తొలి ఏకాదశి మహా విశిష్టమైంది. మార్గశిర మాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని సర్వేకాదశి/ వైకుంఠ ఏకాదశి/ ముక్కోటి ఏకాదశి అంటారు. ధనుర్మాసం శుక్లపక్షంలో వచ్చే ఈ ముక్కోటి ఏకాదశి రోజున మూడు కోట్ల మంది దేవతలు భూలోకానికి వచ్చి శ్రీమహా విష్ణువును పూజిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శిస్తే సమస్త పుణ్యపరంపరలు చేకూరతాయని భక్తుల విశ్వాసం. అందుకే, తెల్లవారుజామునే స్వామివారి దర్శనార్థం ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు. దీంతో ఆలయాల వద్ద ఆధ్యాత్మిక సందడి కనిపిస్తోంది.

పుణ్యతిథి కావడం వల్ల దీన్ని మోక్షద ఏకాదశిగా కూడా పిలుస్తారు. ఇది సూర్యుడు దక్షిణాయానం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించడానికి ముందు వచ్చే ఏకాదశి. మహా విష్ణువు గరుడ వాహనుడై మూడు కోట్ల మంది (ముక్కోటి) దేవతలతో కలిసి భూలోకానికి దిగి వచ్చి భక్తులకు దర్శనమిస్తారు. అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చినట్టు అష్టాదశ పురాణాలు పేర్కొంటున్నాయి. వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ మహా విష్ణువును ఉత్తర ద్వారం నుంచి దర్శించుకోవాలని చాలా మంది ఆరాటపడుతుంటారు. వైకుంఠం తలుపులు తెరచుకునే ఈ పర్వదినాన శ్రీహరి ముక్కోటి దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు.




Updated : 23 Dec 2023 1:38 AM GMT
Tags:    
Next Story
Share it
Top