Home > ఆంధ్రప్రదేశ్ > ఎప్పుడు మూడొస్తే..అప్పుడే క్లాసులు ..ప్రిన్సిపల్ వికృత చేష్టలు

ఎప్పుడు మూడొస్తే..అప్పుడే క్లాసులు ..ప్రిన్సిపల్ వికృత చేష్టలు

ఎప్పుడు మూడొస్తే..అప్పుడే క్లాసులు ..ప్రిన్సిపల్ వికృత చేష్టలు
X

తమపై ప్రిన్సిపల్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని విజయవాడలో నర్సింగ్‌ విద్యార్థినులు ఆందోళన బాట పట్టారు. తరగతుల పేరుతో అర్థరాత్రుల్లు ఇష్టం వచ్చినట్లు తమతో అసభ్యంగా వ్యవహరిస్తున్నాడని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది విద్యార్థినులు ప్రిన్సిపల్ వ్యవహారం నచ్చక టీసీలు తీసుకుని ఇంటికి వెళ్లిపోయారు. మిగతా అమ్మాయిలు కూడా తమకు టీసులు ఇవ్వాలని కళాశాల ముందు నిరసన చేపట్టారు. విద్యార్థి సంఘాలు కూడా స్టూడెంట్స్‎కు అండగా నిలిచాయి. ఈ క్రమంలో ఓ విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రంగప్రవేశం చేసి ప్రిన్సిపల్‎ను అదుపులోకి తీసుకున్నారు.



విజయవాడ గ్రామీణ మండలంలోని అంబాపురం గ్రామంలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పారామెడికల్‌ అండ్‌ అలైడ్‌ హెల్త్‌ సైన్సెస్‌ కళాశాలకు చెందిన విద్యార్థినులు ఆందోళన బాట పట్టారు. కళాశాల ప్రిన్సిపల్, ఛైర్మన్‌ బసిరెడ్డి రవీంద్రరెడ్డి తమను లైంగికంగా వేధిస్తున్నారని విద్యార్థినులు ఆరోపణలు చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ విద్యార్థినులు కళశాల ప్రాంగణంలోని రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. విద్యార్థి, మహిళా సంఘాలు కళాశాల స్టూడెంట్స్‎కు మద్దతుగా నిలిచాయి. రవీంద్రరెడ్డిపై పోక్సో కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశాయి. ప్రస్తుతం బసిరెడ్డి రవీంద్రరెడ్డి పోలీసులు అదుపులో ఉన్నాడు.

వైయస్‌ఆర్‌ జిల్లాకు చెందిన రవీంద్రరెడ్డి అంబాపురంలో 6 ఏళ్ల క్రితం ఫణి స్కూల్‌ ఆఫ్‌ నర్సింగ్‌ ఏర్పాటు చేశారు. ఏడాది క్రితం వైఎస్‌ఆర్‌ యూనివర్శిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ గుర్తింపుతో పారామెడికల్‌ అండ్‌ అలైడ్‌ హెల్త్‌ సైన్సెస్‌ కాలేజీని ప్రారంభించాడు. ఈ కాలేజీలో 83 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. చదువు నిమిత్తం వచ్చే విద్యార్థినులకు హాస్టల్‌లో వసతి సదుపాయం కూడా కల్పించాడు. అయితే తమతో రవీంద్రరెడ్డి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని బీఎస్సీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ ఆందోళనకు దిగడంతో ప్రిన్సిపల్ వేధింపుల విషయం వెలుగులోకి వచ్చింది.

విద్యార్థినులు మాట్లాడుతూ.."రాత్రి 11 గంటలకు క్లాసులు ఉన్నాయి రావాలంటాడు. ఇప్పుడు తరగతులు ఏంటని ప్రశ్నిస్తే, నాకు ఎప్పుడు మూడొస్తే అప్పుడే క్లాసులు చెబుతాను అంటాడు. క్లాసుల పేరుతో నానా ఇబ్బందులు పెడుతున్నాడు. శరీర భాగాలపై చేతులతో తాకుతూ, అసభ్యకరమైన మాటలతో ఇబ్బంది పెడుతుంటాడు. మా ఇంట్లో వారితో అస్సలు మాట్లాడించేవాడు కాదు. హెల్త్ బాగోక పోయినా వేధించేవాడు. ఇంటర్నల్స్ లో మార్కులు వేసేది అతనే. ప్రిన్సిపల్‌-ఛైర్మన్‌గా అతనే కావడంతో మా బాధ ఎవరికి చెప్పాలో అర్థం కాలేదు. రెండేళ్ల క్రితం సీనియర్‌ విద్యార్థిని లైంగికంగా వేధించాడు. అదే పరిస్థితి మాకు వస్తుందేమోనని భయంగా ఉంది. అందుకే టీసీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము"అని తమ ఆవేదనను వ్యక్తం చేశారు.

Updated : 6 Jun 2023 8:38 AM IST
Tags:    
Next Story
Share it
Top