Home > ఆంధ్రప్రదేశ్ > 190 కోట్లతో ఇంద్రకీలాద్రి అభివృద్ధి : మంత్రి

190 కోట్లతో ఇంద్రకీలాద్రి అభివృద్ధి : మంత్రి

190 కోట్లతో ఇంద్రకీలాద్రి అభివృద్ధి : మంత్రి
X

విజయవాడ దుర్గమ, శ్రీశైలం ఆలయాలను మరింత అభివృద్ధి చేస్తున్నామని ఏపీ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. మాస్టర్‌ప్లాన్‌కు అనుగుణంగా విజయవాడ ఇంద్రకీలాద్రి అభివృద్దికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఒకేసారి 1500 నుంచి 1800 మంది అన్నప్రసాదం స్వీకరించేలా రూ. 30 కోట్లతో రెండు ఫ్లోర్‌లుగా అన్నదానం భవనం నిర్మిస్తున్నట్లు తెలిపారు. భక్తుల రద్దీని తట్టుకునేలా రూ. 20 కోట్ల అంచనాలతో అదనంగా క్యూలైన్ల కాంప్లెక్స్ ఎక్స్టెన్షన్ నిర్మాణంతోపాటు రూ. 28 కోట్లతో స్టెయిర్ కేస్ నిర్మిస్తున్నట్లు చెప్పారు. ప్రసాదం పోటు తయారీ, ప్రసాదం కౌంటర్లు, స్టాక్ పాయింట్‌ను రూ. 27 కోట్లతో ఒకే భవనంగా నిర్మిస్తున్నామన్నారు.

అమ్మవారికి కుంకుమ పూజ ప్రత్యేకంగా నిర్వహించడానికి వీలుగా రూ. 6 కోట్లతో పూజా మండపం ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. దీనికి జులై రెండో వారంలో టెండర్లు పిలుస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా విజయవాడ దేవాలయంలో ఒక మెగా వాట్ సోలార్ ప్లాంట్ త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. రూ. 60 కోట్ల రూపాయిలతో మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ 70కోట్ల నిధులతో పాటు అదనంగా రూ.120 కోట్ల ఆలయ నిధులతో విజయవాడ ఇంద్రకీలాద్రి అభివృద్ది చేస్తున్నామని చెప్పారు.

శ్రీశైలంలో రూ.75 కోట్లతో క్యూ కాంప్లెక్స్ నిర్మిస్తున్నట్లు మంత్రి సత్యనారాయణ తెలిపారు. రూ.35 కోట్లతో శ్రీశైలం మాడవీధులలో 750 మీటర్లు పొడవుతో సాల మండపాలు నిర్మిస్తామన్నారు. శ్రీ కృష్ణదేవరాయల కాలంలో సాల మండపాల నిర్మాణాలు జరిగాయన్న మంత్రి మళ్లీ సీఎం జగన్‌ హయాంలో నిర్మించబోతున్నట్లు తెలిపారు. కాణిపాకంలో రూ. 3.60 కోట్లతో అన్నదానం కాంప్లెక్స్. రూ. 4 కోట్లతో క్యూ కాంప్లెక్స్ నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. శ్రీవాణి ట్రస్టుపై కొందరు దుష్పచారం చేస్తున్నారని.. శ్రీవాణి ట్రస్టుపై వచ్చిన నిధులని ధర్మ ప్రచారం, ఆలయాల నిర్మాణాలకి ఉపయోగిస్తున్నట్లు స్పష్టం చేశారు.

Updated : 28 Jun 2023 9:59 AM IST
Tags:    
Next Story
Share it
Top