Home > ఆంధ్రప్రదేశ్ > Vizag RK Beach: రెండో రోజే కొట్టుకుపోయిన ఫ్లోటింగ్ బ్రిడ్జి

Vizag RK Beach: రెండో రోజే కొట్టుకుపోయిన ఫ్లోటింగ్ బ్రిడ్జి

Vizag RK Beach: రెండో రోజే కొట్టుకుపోయిన ఫ్లోటింగ్ బ్రిడ్జి
X

విశాఖ ఆర్కే బీచ్‌లో పర్యాటకులకు పెను ప్రమాదం తప్పింది. ఆదివారం అట్టహాసంగా ప్రారంభించిన ఫ్లోటింగ్ బ్రిడ్జి రెండో రోజే తెగిపోయింది. ఫ్లోటింగ్ బ్రిడ్జిలోని చివరి భాగం తెగిపోయి సముద్రంలోకి కొట్టుకుపోయింది. అయితే ఆ సమయంలో అదృష్టవశాత్తూ అక్కడ ఎవరూ లేకపోవటంతో ప్రమాదం తప్పింది. దీంతో ఆర్కే బీచ్ అందాలను చూసేందుకు వచ్చిన పర్యాటకులు భయపడిపోయారు. ఘటన జరిగిన సమయంలో ఫ్లోటింగ్ బ్రిడ్జి మీద ఎవరూ లేకపోవటంతో ఊపిరి పీల్చుకున్నారు.

ఆర్కే బీచ్ వద్ద వైఎంసిఏ సమీపంలో నిర్మించిన ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జిని ఆదివారం మంత్రి గుడివాడ అమర్‌నాథ్, వైసీపీ రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, జిల్లా కలెక్టర్ మల్లిఖార్జున తదితరులు కలిసి ప్రారంభించారు. ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జిని సుమారు కోటీ 60 లక్షల వ్యయంతో నిర్మించారు. అలలు ఎక్కువగా ఉండే విశాఖ సముద్ర తీరంలో ఏర్పాటు చేయడం తగదని, ప్రమాదాలు జరుగుతాయని పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా వినకుండా జిల్లా కలెక్టర్ మల్లిఖార్జున, జీవీఎంసీ కమీషనర్ సాయికాంత్ వర్మ పట్టుపట్టి ప్రైవేటు వ్యక్తులతో దీనిని ఏర్పాటు చేయించారు. విశాఖ మెట్రోపాలిటన్ రీజయన్ డెవలప్మెంట్ అథారిటీ ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేప‌ట్టింది. జనవరి మొదటి వారంలో ఈ పనులు చేపట్టి వేగంగా పూర్తిచేసింది. అయితే ప్రారంభించిన రెండో రోజే.. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ తెగిపోవటంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆర్కే బీచ్‌కు వచ్చిన సందర్శకులు సైతం దీనిపై మండిపడ్డారు. సరదాగా అలా సముద్రంపై నడక సాగిద్దామనుకుంటే ఇప్పుడు భయం వేస్తోందని చెప్తున్నారు.

మరోవైపు ఫ్లోటింగ్ బ్రిడ్జి నిర్మాణ సమయంలోనే కొంతమంది నిపుణులు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్కే బీచ్‌లో అలల తీవ్రత ఎక్కువని, తేలియాడే ఫ్లోటింగ్ బ్రిడ్జిలు కొన్ని సందర్భాల్లో ప్రమాదాలకు దారితీయవచ్చనే అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే ప్రారంభించిన రెండో రోజే ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించలేకపోయారు. తొలుత ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జిని జోడుగుళ్ల పాలెం తీరంలో ఏర్పాటు చేయాలని భావించగా అటవీశాఖ అభ్యంతరాలు తెలిపింది. దీంతో జీవీఎంసీ పరిధిలోకి వచ్చే ఆర్‌కే‌బీచ్‌లో హడావుడిగా ఏర్పాటు చేశారు. ఒకే పర్యాయం వంద మంది ఈ బ్రిడ్జ్ మీద ఉండే విధంగా అన్ని రకాల భద్రతా చర్యలతో ఏర్పాటు చేశామని కలెక్టర్ ప్రకటించిన 24 గంటలు గడవక ముందే బ్రిడ్జి మీద ఒక్కరు కూడా లేని సమయంలో బ్రిడ్జిలో ఒక ముక్క సముద్రంలో కొట్టుకుపోవడం భద్రతపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. సరైన అధ్యయనం లేకుండా, సంబంధిత శాఖల నిపుణుల అనుమతులు నివేదికలు తీసుకోకుండా అధికారులు ఇష్టారీతిన వ్యవహరిస్తే పరిణామాలు ఎలా ఉంటాయో ఆ బ్రిడ్జ్ తెలియజేసిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ఫ్లోటింగ్ బ్రిడ్జి తెగిపోవడంతో సోషల్ మీడియా వేదికగా జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏర్పాటు చేసిన ఒక్కరోజులోనే ఇలా తెగిపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అలాగే.. రాత్రి ఈ ఘటన జరగడంతో ఎటువంటి అపాయం జరగలేదని.. ఒక వేళ దానిపై ఎవరైనా ఉన్న సమయంలో అలా జరిగితే ప్రాణ నష్టం జరిగిదేని ప్రజలు మండిపడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం పబ్లిసిటీ కోసం ఇలానే చేస్తుందని.. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో.. ఏదో చేసినట్లు పోస్టర్లు కట్టుకుని ఓట్లు దండుకోవాలని చూస్తోందని సోషల్ మీడియా వేదికగా వైసీపీని దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.

Updated : 26 Feb 2024 7:22 PM IST
Tags:    
Next Story
Share it
Top