ap volunteers : ఇద్దరు మహిళలపై గ్రామ వాలంటీర్ దాడి... !
X
ఇటీవల కాలంలో ఏపీ రాజకీయాలు వాలంటీర్ వ్యవస్థ చుట్టూ తిరిగాయి. వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన వాలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర విమర్శలు చేయడం దుమారం రేగింది. ఈ అంశంపై అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. ఇలాంటి సమయంలోనే రాష్ట్రంలోని పలుచోట్ల వాలంటీర్స్ నేరాలకు పాల్పడ్డం చర్చనీయాంశమవుతోంది. ఇటీవల విశాఖలోని ఓ వృద్ధురాలిని వాలంటీర్ హత్య చేయగా, తాజాగా అన్నమయ్య జిల్లాలో మరో వాలంటీర్ రెచ్చిపోయాడు. ఇద్దరు మహిళలపై తన కుటుంబ సభ్యులతో కలిసి దాడికి పాల్పడ్డాడు.
అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన వాలంటీర్ మహేష్‌తో చంద్రశేఖర్ అనే వ్యక్తి గొడవ పడ్డాడు. ఈ గొడవలో వాలంటీర్ తో పాటు అతడి కుటుంబసభ్యులు తలదూర్చడంతో పంచాయితీ పోలీస్ స్టేషన్ కు చేరింది. పోలీసులు ఇరు వర్గాలను నచ్చజెప్పి పంపించారు. అయితే ఆదివారం మరోసారి ఇరువర్గాల మద్య గొడవ చెలరేగింది. చంద్రశేఖర్ భార్య గౌతమితో వాలంటీర్ మహేష్, కుటుంబ సభ్యులు గొడవకు దిగారు. కోడలిపై దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన అత్త కృష్ణమ్మపై దాడిచేసారు. ఈ ఘటనలో భార్య గౌతమి, అత్త కృష్ణమ్మ తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే వాలంటీర్ మహేష్ పించన్ డబ్బులు ఇవ్వడానికి లంచం డిమాండ్ చేసాడని అవి ఇవ్వకపోవడంతోనే తమతో గొడవలకు దిగుతున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు.