AP Assembly: వచ్చే నెల రెండోవారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు..!
X
ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. సీట్ల ఖరారు వేళ పార్టీల్లో కొత్త పరిణామాలు తెర మీదకు వస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే తన పార్టీ అభ్యర్దులను దాదాపు ఖరారు చేసారు. ఒకటి, రెండు రోజుల్లోనూ తుది జాబితా ప్రకటనకు సిద్దం అవుతున్నారు. రాబోయే ఎన్నికల్లో కొత్త వరాల ప్రకటనకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక, ఈ ప్రభుత్వ హాయంలో అసెంబ్లీ చివరి సమావేశాలకు రంగం సిద్దమవుతోంది.
ఫిబ్రవరి రెండోవారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు పెట్టే అవకాశం ఉంది. ఫిబ్రవరి 6 నుంచి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఈ సమావేశాలు 4 రోజుల నుంచి 5 రోజుల పాటు నిర్వహించాలనే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. ఈ క్రమంలో.. ఇప్పటికే అన్ని శాఖల నుంచి ఆర్థికశాఖ అంచనాలు తెప్పించుకుంది. కాగా.. ఎన్నికల ముందు చివరి సమావేశాలు కావడంతో కీలక ప్రకటనలు ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉంటే.. ఎన్నికల ముందు ఓటాన్ అకౌంట్ పెట్టడం ఆనవాయితీగా వస్తోంది.
సీఎం జగన్ అధికారంలోకి వచ్చి ఐదేళ్లు అవుతోంది. ఈ సందర్భంగా సమావేశాల్లో జగన్ చేపట్టిన పథకాలు, సంక్షేమంపై అసెంబ్లీలో వివరించే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కాగా నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి గుడ్ బై చెప్పారు. దీంతో వారికి అసెంబ్లీ స్పీకర్ అనర్హత నోటీసులు జారీ చేశారు. వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. సోమవారం స్పీకర్ ఎదుట హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో స్పీకర్ ఏం చర్యలు తీసుకుంటారనేదానిపై చర్చ సాగుతోంది. స్పీకర్ నిర్ణయం మేరకు అసెంబ్లీ సమావేశాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.