ఒక్కో లబ్ధిదారునికి ఉచితంగా రూ.7 లక్షల ఆస్తి ఇచ్చాం: ఏపీ సీఎం
X
రాష్ట్ర ప్రభుత్వ కడుతున్నది జగనన్న కాలనీలు కాదు, ఏకంగా ఊర్లనే నిర్మిస్తోందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన మాటను అధికారంలోకి వచ్చిన అనంతరం నేరవేర్చామని సీఎం గుర్తు చేశారు. కృష్ణా జిల్లా గుడివాడలో ఏర్పాటు చేసిన టిడ్కో ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
సభలో జగన్ మాట్లాడుతూ.."అధికారంలోకి వస్తే ఉచితంగా ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చాము. ఆ హామీ ప్రకారం టిడ్కో గృహాలు నిర్మించి ఇస్తున్నాము. ఇప్పటి వరకు 5.52 లక్షల ఇళ్ల నిర్మాణం జరిగింది. రాష్ట్రంలో అర్హులైన 30 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందించాము. 178 ఎకరాల్లో మరో 7,728 ఇళ్ల పట్టాలను ఇవ్వనున్నాము. ఒక్కో లబ్ధిదారునికి కేటాయించిన భూమి విలువ రూ.2 నుంచి రూ.10 లక్షల వరకు ఉంటుంది. ప్రతి ఇంటి నిర్మాణం కోసం అయిన ఖర్చు రూ.12 లక్షలు. ఇకపై రాష్ట్రంలోని 16 వేలకు పైగా కుటుంబాలు ఈ ఇళ్లలోనే ఉంటారు. ఇది ఎంతో సంతోషించాల్సిన విషయం. రాష్ట్రవ్యాప్తంగా17 వేల కాలనీల నిర్మాణం జరుగుతోంది. కేవలం రూపాయికే 300 చ.అ.ల్లో ఇళ్లను కట్టి ఇస్తున్నాము. అక్కచెల్లెమ్మల చేతిలో రూ. 6 నుంచి 15 లక్షల వరకు ఆస్తి పత్రాలను పెట్టాము. జులై 7వ తేదీన మరో 4,200 ఇళ్లు మంజూరు చేస్తాం" అని సీఎం జగన్ తెలియజేశారు.