Home > ఆంధ్రప్రదేశ్ > YS Sharmila: ‘ఇందిరమ్మ అభయం’ ప్రకటించిన వైఎస్ షర్మిల

YS Sharmila: ‘ఇందిరమ్మ అభయం’ ప్రకటించిన వైఎస్ షర్మిల

YS Sharmila: ‘ఇందిరమ్మ అభయం’ ప్రకటించిన వైఎస్ షర్మిల
X

ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి ప్రధాన కారణం ఓవైపు చంద్రబాబు అయితే, మరోపక్క వైఎస్ జగన్ అని ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. ఇద్దరూ కలిసి బీజేపీ మెడలు వంచి ఉండి ఉంటే.. ఈపాటికి మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చుండేదని అన్నారు. ఊసరవెల్లి కూడా చంద్రబాబు వద్దే రంగులు మార్చడం నేర్చుకుందని వైఎస్ షర్మిల అన్నారు. సీఎం అయ్యాక చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీ అన్నారని షర్మిల గుర్తు చేశారు. ఎవరైనా ప్రత్యేక హోదా కోసం నిరసనలు చేస్తే వారిపై కేసులు పెట్టి జైల్లోకి తోయించారని ఆరోపించారు. అనంతపురం జిల్లాలో ఏపీ కాంగ్రెస్ న్యాయసాధన సభ నిర్వహించింది. పోరాడదాం.. సాదిద్ధాం నినాదంతో ఈ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల చంద్రబాబు, జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

ప్రత్యేక హోదాను జగన్ తెస్తారని ప్రజలు నమ్మి ఓటేస్తే.. అధికారంలోకి వచ్చాక ఒక్కసారి అయినా ప్రత్యేక హోదా కోసం నిజమైన ఉద్యమం చేశారా అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. అటు చంద్రబాబు, ఇటు జగన్ ఇద్దరూ ప్రత్యేక హోదాను విస్మరించారన్నారు. ప్రత్యేక హోదా కోసం ఎంపీలు అందరం మూకుమ్మడి రాజీనామాలు చేద్దామని జగన్ పిలుపు ఇచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ...ప్రత్యేక హోదా రానందునే ఏపీకి పరిశ్రమలు రాలేదని, అందుకే యువతకు ఉద్యోగాలు కూడా రాలేదన్నారు. చంద్రబాబు, వైఎస్ జగన్ ఇద్దరూ బీజేపీతో అంటకాగారని, ఆ పార్టీకి బానిసలుగా మారారని విమర్శించారు. బీజేపీకి మనకు ఏం ఇచ్చింది? ప్రశ్నిస్తూ... ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే.. ఎలా పొత్తులు పెట్టుకున్నా అడిగేవారు కాదన్నారు. ఏపీకి బీజేపీ అన్యాయం చేస్తున్నా కూడా ప్రశ్నించకపోగా.. అదే పార్టీతో పొత్తులు పెట్టుకుంటుంటే.. ప్రజలకు ద్రోహం చేస్తున్నట్లు కాదా? అని నిలదీశారు.

ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా కోసం ఎన్నో దీక్షలు, ధర్నాలు చేశారని షర్మిల గుర్తు చేశారు. గతంలో 3 వేల కి.మీ పాదయాత్ర చేసి పార్టీని నిలబెట్టానని.. అలాంటిది.. చెల్లినని చూడకుండా తనపై, తన భర్తపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని మండిపడ్డారు. డబ్బులు పెట్టి సోషల్‌మీడియాలో దూషిస్తున్నారని ఆరోపించారు. జగన్‌ ఏం చేస్తున్నారో దేవుడు చూస్తున్నాడని, తాను వైఎస్‌ రాజశేఖర్ బిడ్డనని భయపడే మనిషిని కాదని అన్నారు. రాష్ట్ర ప్రజలకు మేలు చేయడం కోసమే ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెట్టానని చెప్పారు. కాంగ్రెస్‌ తరఫున పోరాటం చేసిన తనను ఒక మహిళనని చూడకుండా దారుణంగా ప్రవర్తించి అడ్డుకున్నారని ఆరోపించారు. జగన్‌ తన పాలనలో ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదని, మద్యపానం నిషేధం చేస్తానని చెప్పి.. ప్రభుత్వం ద్వారానే నాసిరకం మద్యం అమ్ముతున్నారని ఆరోపించారు.

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక.. ఇందిరమ్మ అభయం కింద ఇంటింటికి మహిళల పేరు మీద రూ.5 వేల ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపారు. ‘‘కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి పునాదులు వేసింది. మెట్టు మెట్టు కట్టుకుంటూ నిర్మాణం చేసింది. ఇదే కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రం కోసం ఒక గ్యారెంటీ ఇస్తుంది. ఇంటింటికీ రూ.5 వేలు. పేద కుటుంబాలు నిర్భయంగా బ్రతికే పథకం ఇది. పేదరికం నిర్మూలన కోసం ఇందిరమ్మ అభయం. అసమానతలు తొలగింపు కోసం ఈ నూతన ఆలోచన చేశాం. ప్రతి ఇంటికి అండగా నిలబడేది ఇందిరమ్మ అభయం. ప్రతి ఇంటికి మహిళ పేరుమీదే ఈ రూ.5 వేలు ఇస్తాం. ఇంటికి దైవం ఇల్లాలు. అందుకే మహిళలకు ఈ గ్యారెంటీ. మహిళ పేరు మీదనే చెక్కు ఇస్తాం. కాంగ్రెస్‌ హయాంలో దివంగత వైఎస్సార్ ఎన్నో అద్భుతమైన పథకాలు అమలు చేశారు. మళ్ళీ రాష్ట్ర అభివృద్ది కాంగ్రెస్‌తోనే సాధ్యం. రాష్ట్రం ఏర్పడిన 10 ఏళ్లలో పది అడుగులు కూడా ముందుకు పడలేదు’’ అని వైఎస్ షర్మిల అన్నారు.

Updated : 26 Feb 2024 2:51 PM GMT
Tags:    
Next Story
Share it
Top