విశాఖ ఎంపీ కుటుంబం కిడ్నాప్ కేసు నిందితుడు హేమంత్ ఎవరు ?
X
ఓ అధికార పార్టీ ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేయడం అంటే సాధరణ విషయం కాదు. అందుకు చాలా ధైర్యం కావాలి. తర్వాత వచ్చే పరిస్థితులను ఎదుర్కొనే శక్తి ఉండాలి. ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉంటే ఇలాంటి రిస్క్ చేయరు. కానీ విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబాన్ని ఓ రౌడీషీటర్ అవలీలగా కిడ్నాప్ చేశాడు. ఎంపీ ఇంటిలోనే 48 గంటలు ధైర్యంగా ఉండి..వారి కుటుంబ సభ్యులను చిత్రహింసలకు గురిచేశాడు. ఇంతకీ కిడ్నాప్ కు పాల్పడిన ప్రధాన నిందితుడు హేమంత్ ఎవరు..? అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటీ ? అతడి నేరచరిత్ర ఏంటో ఒకసారి తెలుసుకుందాం.
హేమంత్ స్వస్థలం భీమిలి పరిధిలోని గొల్లల తాళ్లవలస.తండ్రి ఆటోడ్రైవరు కాగా, తల్లి ప్రాథమిక పాఠశాలలో ఆయా. సోదరుడు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. సీఏ చదువుతూ మధ్యలోనే మానేశాడు. అనంతరం సులభంగా మనీ సంపాదించాలనే ఉద్దేశంతో నేరాటబాట పట్టాడు. ఆరిలోవలో హేమంత్ కుటుంబం కొన్ని రోజులు నివాసం ఉండేది. ఆ సమయంలో ఓ మహిళను మోసం చేసి ఆమె బంగారాన్ని కాజేశాడు. ‘నీ మెడలో ఉన్న నగ లాంటిదే మా అమ్మకు కొనాలి. దుకాణానికి రా’ అని చెప్పి ఓ మహిళను భీమిలి బెళ్లలమెట్ల సమీపానికి తీసుకెళ్లి దుస్తులు విప్పి, బంగారంతో ఉడాయించాడు. ఈ కేసులో మూడేళ్ల హేమంత్ కు మూడేళ్లు జైలు శిక్ష పడింది.
జైలు నుంచి వచ్చాక కూడా హేమంత్ తీరులో మార్పు కనిపించలేదు. ఓ వ్యక్తి వద్ద 2 లక్షలు అప్పుతీసుకొని తిరిగి ఇవ్వడానికి నిరాకరించాడు. అడిగితే అతడి అబ్బాయిని చంపేస్తానని బెదరింపులకు దిగాడు. 2019లొ మాజీ కార్పొరేటర్, కాంగ్రెస్ నాయకురాలు విజయారెడ్డిని దారుణంగా హత్య చేశాడు.
గత రెండు మూడు సంవత్సరాల నుంచి కిడ్నాప్‌లు, రియల్టర్స్‌ను బెదిరించి డబ్బులు వసూలు చేయడం వంటిపై హేమంత్ దృష్టిపెట్టాడు. ఇందుకు కోసం తన సన్నిహితురాలు సుబ్బలక్ష్మి సాయం తీసుకున్నాడు. గతేడాది జూన్ 21న భీమిలికి చెందిన టీడీపీ నేత, రియల్టర్ పాసి రామకృష్ణను రుషికొండలోని ఒక రిసార్ట్‌కు పిలిచి సుబ్బలక్ష్మితో కలిసి కిడ్నాప్ చేశాడు. ఈ ఏడాది మధుసూదన్ అనే రియల్టర్‌కు తన ప్లాట్ అమ్ముతానని నమ్మబలికి కిడ్నాప్ చేసి రూ.7.50 లక్షలు వసూలు చేశాడు. ఈ కేసులోనే జైలుకు వెళ్లి, మే 10న విడుదలై బయటకు వచ్చారు.
మొత్తం హేమంత్‌పై 12 కేసులున్నాయి. వాటిలో 3కిడ్నాప్ కేసులు, ఒక హత్య కేసు, మూడు గంజాయి కేసులు. 2019లో నాలుగో పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలోను, ఆ తర్వాత పీఎంపాలెం, భీమిలి పరిధిలోనూ రౌడీషీట్లు తెరిచారు. విశాఖ ఎంపీ కుటుంబం కిడ్నాప్‌కు జైలులోనే పన్నాగం పన్నాడు. ఇందుకోసం పలువురు నేరస్తులతో కలిసి ఓ గ్యాంగ్ ఏర్పాటు చేసుకున్నాడు. ఈ కేసులో దొరికిపోతే బెయిల్ కోసం ముందుగా లాయర్‌ను కూడా మాట్లాడుకొని అతడికి డబ్బులు చెల్లించాడు.