సౌతిండియాలో ‘హ్యాట్రిక్’ సీఎం ఇప్పట్లో కష్టమే.. ఇక ఆ చాన్స్ జగన్, స్టాలిన్లకే!
X
కేసీఆర్ ఈ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొడతారని బీఆర్ఎస్ శ్రేణులు ధీమాగా చెప్పాయి. దక్షిణ భారతంలో హ్యాట్రిక్ సాధించిన తొలి సీఎంగా చరిత్ర సృష్టిస్తారని అన్నాయి. కానీ ప్రజా తీర్పు ఆ ఆశలను వమ్ము చేసింది. ఆ సంగతి పక్కనబెడితే సౌతిండియాలో ఇంతవరకు వరుసగా మూడుసార్లు(హ్యాట్రిక్) అయిన ఒక్క ముఖ్యమంత్రీ లేకపోవడం గమనార్హం. దేశంలోని దక్షిణ, ఉత్తర, తూర్పు రాష్ట్రాల్లో ఈ రికార్డ్ సాధించిన సీఎంలు చాలామందే ఉన్నారు. హ్యాట్రిక్‌ను దాటి నాలుగైదు పర్యాయాలు కూడా వరుసగా సీఎంలు అయ్యారు.
పశ్చిమ బెంగాల్ దివంగత ముఖ్యమంత్రి జ్యోతిబసు ఏకంగా 23 ఏళ్లకుపై గా విరామం లేకుండా సీఎం పదవి నిర్వహించారు. సిక్కిం మాజీ సీఎం పవన్ కుమార్ చామ్లింగ్ రికార్డ్ మరింత ఘనం. దేశంలో ఎక్కువ కాలం సీఎం పోస్టులో కొనసాగింది ఆయననే. 1994 నుంచి 2019 వరకు ఆయన 24 ఏళ్లకు పైగా పదవిలో ఉన్నారు. గెగాల్ అపాంగ్(అరుణాచల్), లాల్ తన్హావ్లా(మిజోరం), షీలా దీక్షిత్(ఢిల్లీ), రమణ్ సింగ్(ఛత్తీస్‌గఢ్) తదితరులు కూడా హ్యాట్రిక్ సీఎంలే. ప్రస్తుతం పదవుల్లో కొనసాగుతున్న మమతా బెనర్జీ(పశ్చిమ బెంగాల్), నవీన్ పట్నాయక్(ఒడిశా) కూడా ఈ జాబితాలో ఉన్నాయి.
అయితే దక్షిణ భారతం నుంచి ఇలాంటి రికార్డ్ సాధించిన సీఎం ఇప్పటికీ ఒక్కరూ లేరు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ప్రజల తీర్పు, సీఎంలను మార్చే కాంగ్రెస్ సంస్కృతి, నేతల మరణాలు వీటిలో కొన్ని. ప్రస్తుతం దక్షిణ భారతదేశంలో హ్యట్రిక్ సీఎం ఘనత కొట్టేసే అవకాశం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి, తమిళనాడు సీఎం స్టాలిన్‌కు మాత్రమే ఉన్నట్టు కనిపిస్తోంది. స్టాలిన్ 2021 ఎన్నికల్లో గెలిచి సీఎం అయ్యారు. జగన్ 2019 ఎన్నికల్లో తొలిసారి సీఎం అయ్యారు. జగన్ సీఎం కావాలంటే 2024 అసెంబ్లీ ఎన్నికల్లోనూ, 2029 ఎన్నికల్లోనూ గెలవాలి. 2024 ఎన్నికలను గట్టెక్కినా 2029 ఎన్నికల గురించి ఇప్పుడే చెప్పలేం. ఆ ఎన్నికల్లో గెలిస్తే హ్యాట్రిక్ చేరినట్టే. జగన్‌తో పోలిస్తే స్టాలిన్‌కు ఈ అవకాశం మరింత ఎక్కువ. తమిళనాడులో విపక్షాల ఉనికి నామమాత్రమే. ఇక ఐదేళ్లకొకసారి ప్రభుత్వాన్ని మార్చే కేరళలో హ్యాట్రిక్ సీఎం సమీప భవిష్యత్తులో కష్టమే. బీజేపీ, కాంగ్రెస్‌లలో అంతర్గత కుమ్ములాటలు, అవినీతి కారణంగా కర్నాటకలోనూ ఇంతవరకూ హ్యాట్రిక్ సీఎం రాలేదు. ఇకపైనా వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.