Home > ఆంధ్రప్రదేశ్ > షర్మిలకు ఏపీ పగ్గాలు.. కాంగ్రెస్ రాత మారేనా..?

షర్మిలకు ఏపీ పగ్గాలు.. కాంగ్రెస్ రాత మారేనా..?

షర్మిలకు ఏపీ పగ్గాలు.. కాంగ్రెస్ రాత మారేనా..?
X

ఊహించిందే జరిగింది. కాంగ్రెస్ హైకమాండ్ రాజన్న బిడ్డకు ఏపీ పగ్గాలు అప్పగించింది. ఇటీవలే వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేసిన వైఎస్ షర్మిల.. పార్టీ ఏపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. జనాకర్షక నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డగా ఆమె రాష్ట్రంలో పార్టీకి పూర్వ వైభవం తెస్తారని కాంగ్రెస్ హైకమాండ్ ఆశ. దక్షిణాదిన కర్నాటక, తెలంగాణల్లో అధికారపగ్గాలు చేపట్టడంతో షర్మిల రాకతో అదే ఫలితం ఏపీలోనూ పునరావృతం అవుతుందని నమ్ముతోంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ గడ్డు పరిస్థితి ఎదుర్కొంది. కొత్తగా ఏర్పడిన తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు ఆ పార్టీకి తొమ్మిదిన్నరేండ్లు పట్టింది. అటు ఏపీలోనూ పరిస్థితి అలాగే ఉంది. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్‌ స్థానాన్ని జగన్మోహన్‌రెడ్డి స్థాపించిన వైఎస్‌ఆర్‌సీపీ భర్తీ చేసింది. కాంగ్రెస్ బడా నేతలు మొదలు.. కార్యకర్తల వరకు వైఎస్‌ జగన్ పంచన చేరడంతో ఏపీలో కాంగ్రెస్‌ ఖాళీ అయ్యింది. 2014లో ఎదురుదెబ్బ తగిలినా.. 2019 ఎన్నికల్లో ఏపీ ప్రజలు టీడీపీకి ప్రత్యర్థిగా, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా వైఎస్‌ఆర్‌సీపీని ఎంచుకున్నారు. ఇదే సమయంలో సొంత అన్న జగన్తో విబేధించిన వైఎస్ షర్మిల.. తన రాజకీయ ఎదుగుదల కోసం తెలంగాణలో అడుగుపెట్టారు. 2021లో వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి జయంతి రోజున వైఎస్సాఆర్టీపీ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 3800 కిలోమీటర్లకుపైగా పాదయాత్ర చేసి ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించకున్న షర్మిల.. తెలంగాణ ప్రజల హృదయాలను మాత్రం గెలుచుకోలేకపోయారు.

తెలంగాణ పాలిటిక్స్లో అట్టర్ ఫ్లాపవడంతో షర్మిల.. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందే వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలని భావించారు. అయితే ఆమెను కాంగ్రెస్ లో చేర్చుకుంటే లాభం మాట అటుంచితే నష్టమే ఎక్కువ జరుగుతుందని రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు హైకమాండ్కు వివరించారు. దీంతో షర్మిల కాంగ్రెస్ గూటికి చేరడం తాత్కాలికంగా వాయిదా పడింది. అయితే తెర వెనుక ప్రయత్నాలు మాత్రం కొనసాగాయి. వాస్తవానికి షర్మిల తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండాలనే కోరుకున్నా.. కాంగ్రెస్‌ హైకమాండ్‌ మాత్రం ఆమె సేవలు ఏపీకే ఎక్కువ అవసరమని గుర్తించింది. ఏపీలో పార్టీ ఉనికిని కాపాడుకోవడంతో పాటు తిరిగి పట్టు సాధించేందుకు రాజన్న బిడ్డను బాణంగా ఉపయోగించుకోవాలని భావించింది. అందుకే ఆమెకు పార్టీ రాష్ట్ర పగ్గాలు అప్పగించింది.

నిజానికి వైఎస్ చనిపోయి 10 ఏండ్లు దాటినా ఏపీలో ఇప్పటికీ ఆయన వీరాభిమానులున్నారు. అలాంటి ఏపీని అందులోనూ రాయలసీమ ప్రాంతాన్ని వదిలేసి తెలంగాణ కోడలినంటూ షర్మిల రాజకీయాలు చేయడం ఏపీ ప్రజల్లో చాలా మందికి నచ్చలేదు. తెలంగాణలో విఫలమైన షర్మిలకు ఇప్పుడు ఆంధ్రా పగ్గాలు అప్పగిస్తే అక్కడి ప్రజలు ఆదరిస్తారా అన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో రఘువీరా రెడ్డి, శైలజానాథ్‌, గిడుగు రుద్రరాజు పీసీసీ అధ్యక్షులుగా పనిచేశారు. అయినా పార్టీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంది. పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు వారిలో ఏ ఒక్కరూ ప్రయత్నించలేదన్న విమర్శలు ఉన్నాయి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విభజించిన కాంగ్రెస్‌ తమకు తీవ్ర అన్యాయం చేసిందన్న ఆక్రోశంతో ఉన్న ఏపీ ప్రజలు 2014లో ఆ పార్టీని పాతాళానికి తొక్కేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి 2.8 శాతం, లోక్సభ ఎన్నికల్లో 2.86 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. 2019 నాటికి పరిస్థితి ఇంకా దిగజారింది. అసెంబ్లీ ఎన్నికల్లో 1.17 శాతం, ఎంపీ ఎన్నికల్లో 1.31 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఏ ఎన్నికలోనూ కనీసం ఒక్క స్థానం కూడా సాధించని కాంగ్రెస్ నోటాతో పోటీ పడింది. అలాంటి కాంగ్రెస్ బాధ్యతల్ని పార్టీ హైకమాండ్ అసెంబ్లీ ఎన్నికలకు 100 రోజుల ముందు షర్మిలకు అప్పగించింది. అందుకే త్వరలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ ఏదో అద్భుతం సాధిస్తుందని కోరుకోవడం అత్యాశే అవుతుంది. వైఎస్‌ర్‌ కూతురిగా ప్రజలు ఆమెను ఆదరిస్తే ఈసారి పార్టీ ఓట్ల శాతం పెరిగి కొన్ని సీట్లు రావచ్చు. అంతేతప్ప ఇప్పటికిప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చేయడం లేదా కింగ్ మేకర్ అయ్యేంత సీన్ లేదన్నది చాలా మంది అభిప్రాయం. ఒకవేళ అదే లక్ష్యంతో ఆమె పగ్గాలు చేపడితే ఏపీలో విఫల నాయకురాలిగా మిగిలిపోవడం ఖాయమన్న వాదనలు వినిపిస్తున్నాయి. అందుకే షర్మిల 2024 ఎన్నికలు లక్ష్యంగా కాకుండా 2029 ఎలక్షన్స్పై ఫోకస్ చేస్తే అప్పటికి ప్రధాన పోటీలో నిలిచే అవకాశముంది.

Updated : 16 Jan 2024 11:19 AM GMT
Tags:    
Next Story
Share it
Top