వైసీపీకి యార్లగడ్డ వెంకట్రావు గుడ్ బై !
X
కృష్ణా జిల్లా గన్నవరం రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటి చేసి ఓటమి పాలైనా యార్లగడ్డ వెంకట్రావు పార్టీని వీడారు. త్వరలోనే టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు యార్లగడ్డ వెల్లడించారు. ఇవాళ విజయవాడలో జరిగిన కార్యకర్తల సమావేశంలో వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడిన యార్లగడ్డ... "నాయకులు లేని సమయంలో పార్టీ నుంచి పోటీ చేసాను. అవమానాల కోసమే రాజకీయాల్లోకి వచ్చినట్లైంది. గన్నవరం లో వైసీపీ గెలవడమే ద్యేయంగా పనిచేశా. టిక్కెట్ ఇవ్వమని మాత్రమే సీఎంను అడిగాను. పార్టీ పెద్దలకు ఏమి అర్ధమైందో నాకు తెలియలేదు.ప్రభుత్వం వచ్చినా తమపై కేసులు కొనసాగాయి. ఉంటే ఉండు....పోతే పొమ్మని సజ్జల చెప్పడం తనకు చాలా బాధ,ఆవేదన కలిగించింది. టీడీపీ కంచుకోటలో ఢీ అంటే ఢీ అని పోరాడా. మూడేళ్ళుగా తనకు ఏ ప్రత్యామ్నాయం చూపించలేదు. తడిగుడ్డతో గొంతు కోయడం అంటే ఇదేనేమో.
నమ్మిన మనిషిని కాపాడాల్సిన బాధ్యత ఏ పార్టీకైనా ఉంటుంది. నాకు జరిగినన్ని అవమానాలు రాజకీయాల్లో ఎవరికీ జరగలేదు. టీడీపీలో గెలిచిన అభ్యర్థిని తెచ్చుకోవడం మీకు బలంగా మారిందా ? అని యార్లగడ్డ ప్రశ్నించారు.
త్వరలోనే టీడీపీలో చేరుతున్నట్లు యార్లగడ్డ తెలిపారు. టీడీపీలో చేరేందుకు పార్టీ అధినేత చంద్రబాబు అపాయింట్ మెంట్ కోరుతున్నానని చెప్పారు. గన్నవరం అభ్యర్థగా తాను పనికొస్తానని భావిస్తే టికెట్ ఇవ్వాలని కోరారు. టీడీపీ టికెట్ తనకు ఇస్తే ఎమ్మెల్యేగా గెలిచి కానుకగా ఇస్తానని తెలిపారు. జగన్‌ను అసెంబ్లీలోనే కలుస్తా అని ఆయన వ్యాఖ్యానించారు. గన్నవరాన్ని వదిలే ప్రసక్తి లేదని.. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేసి తీరుతానని యార్లగడ్డ స్పష్టం చేశారు.