దొంగ ఓట్లతో లబ్ధి పొందారని వైసీపీ యత్నం..Purandeshwari comments
X
వైసీపీ తమ అభ్యర్థులతోపాటు ఓటర్లును బదిలీ చేస్తోందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందీశ్వరి ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్ చేస్తోన్న వైనాట్ 175 నినాదం వెనుక కుట్ర ఉందని, దొంగ ఓట్లతో లబ్థి పొందడానికి ప్రయత్నిస్తున్నారని ఆమె విమర్శించారు. కేంద్ర పథకాలను తమవిగా రాష్ట్ర సర్కారు ప్రచారం చేసుకుంటోందని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ఈ నెల 20 నుంచి 29 వరుకు ప్రజా పోరు యాత్ర చేస్తామని తెలిపారు. రాబోయే ఎన్నికల్లోనూ అక్రమ ఓట్ల సాయంతో గెలవాలని భావిస్తున్నారని, అందుకే ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి అభ్యర్థులతో పాటు ఓటర్లను కూడా బదిలీ చేస్తున్నారని ఆరోపించారు.
ఈ ఓట్ల దందాను సీఎం జగనే నడిపిస్తున్నారని ఆరోపించారు. "ఫేక్ ఎపిక్ కార్డులు రూపొందించి, దొంగ ఫొటోలు అతికించి ఒక్క తిరుపతి ఉప ఎన్నికల్లో 35 వేల దొంగ ఓట్లను వేశారు. సీఎం ఇప్పుడు రాష్ట్రంలో వైసీపీ అభ్యర్థుల నియోజకవర్గాలు మార్చుతున్నారు. మంత్రి విడదల రజని చిలకలూరిపేట నుంచి గుంటూరు బదిలీ అయ్యారు. వారి అనుయాయులు 10 వేల మందిని గుంటూరు తీసుకువచ్చి, వారి ఓట్లు నమోదు చేసే ప్రక్రియ లోపాయికారీగా జరుగుతోంది" అని పురందేశ్వరి వివరించారు. భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అక్రమాలను అడ్డుకోవాలని పురందేశ్వరి పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ పాలన, నాయకత్వం పట్ల ఆకర్షితులై ఆరు జిల్లాల్లో పారిశ్రామికవేత్తలు, ఇతర పార్టీల నాయకులు బీజేపీలో చేరుతున్నారని తెలిపారు. ప్రకాశం, చిత్తూరు జిల్లాల నుంచి ఏలూరు రామచంద్రారెడ్డి, కావూరి వాసు, ఐనాబత్తిన సుబ్బారావు, ఖాదర్ వలీసబ్బీ, రామచంద్రారెడ్డి తదితరులకు పురందేశ్వరి కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.