Yv Subba Reddy: ఆమె కాంగ్రెస్‌లో చేరినా మాకేం ఇబ్బంది లేదు.. వైవీ సుబ్బారెడ్డి
X
ఎవరు ఏ పార్టీలో చేరినా జగన్ సంక్షేమ పాలనే వైసీపీకి బలమని, వచ్చే ఎన్నికల్లో పేదలే వైసీపీని గెలిపించి జగన్‌మోహన్ రెడ్డిని మళ్లీ సీఎం ని చేస్తారని అన్నారు ఆ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి. ప్రకాశం జిల్లా పర్యటనలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీలో సంక్షేమ పథకాల ద్వారా లబ్దిపొందుతున్న పేదలందరూ వైసీపీని మరోసారి గెలిపించి వైఎస్ జగన్‌ను సీఎంని చేస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. బీసీలకు సీట్లు ఇవ్వటం కోసమే కొన్ని సీట్లు సర్దుబాటు చేయాల్సి వస్తుందని, ఒకరిద్దరు వెళ్లటం వల్ల తమకేమీ నష్టం లేదన్నారు. కొందరు వారి వ్యక్తిగత కారణాల బయటకు వెళ్తున్నారని.. వెళ్లే వాళ్ల భవిష్యత్తుకు భరోసా ఇచ్చినా వెళ్తున్నారని విమర్శించారు. సీఎం జగన్.. ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు.
బీసీల కోసం సీట్లు సర్దుబాటు చేయాల్సి వస్తుందని, ఇప్పటికీ 35 నియోజకవర్గాల్లో మార్పులు, చేర్పులు చేశామన్నారు. అందరికీ సమన్యాయం చేసేందుకే సీఎం జగన్ కృషి.. ఆయన ఎలా ఆదేశిస్తే అలా పనిచేస్తాం అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్ని యాత్రలు చేసినా, డ్రామాలు వేసినా ప్రజలు నమ్మే పరిస్దితి లేదని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో ఒక్క హామీని కూడా అమలు చేయకుండా పాలన చేశారని ఆరోపించారు. కానీ, మేం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ఇచ్చిన హామీలు నెరవేర్చామన్నారు. కరోనా సమయంలో కూడా ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూశాం.. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పధకాల వల్లే 175 నియోజకవర్గాల్లో గెలుస్తామని భరోసాగా ఉన్నాం అన్నారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఇక, నేను ప్రత్యక్ష రాజకీయాల్లోనే ఉన్నా.. పార్టీ అప్పగించిన భాద్యతలు చేస్తూనే ఉన్నాని గుర్తుచేశారు. షర్మిల కాంగ్రెస్‌లో చేరుతున్నారో లేదో తనకు తెలియదని, ఒకవేళ ఆమె కాంగ్రెస్‌లో చేరినా వైసీపీకి ఎలాంటి ఇబ్బందీ ఉండదన్నారు.