Ambati Rambabu : టీడీపీ, జనసేన, బీజేపీని సముద్రంలో కలిపేస్తాం.. దేనికైనా 'సిద్ధం' అంటోన్న వైసీపీ నేతలు
X
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌కు ప్రజల ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని, టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి వస్తే సముద్రంలో కలిపేస్తామని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. బాపట్ల జిల్లా మేదరమెట్ల సమీపంలో నేడు సిద్ధం సభను నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు సిద్ధం సభ దద్దరిల్లేలా మాట్లాడారు. ముందుగా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ..సీఎం జగన్ మొనగాడు అని, చంద్రబాబు మోసగాడు అని అన్నారు. ఎంత మందితో వచ్చినా బాబు ఓడిపోవడం ఖాయమన్నారు. సింగిల్‌గా వస్తే చితకబాదుతామని, ఇద్దరుగా కలిసి వస్తే విసిరికొడతామని, ముగ్గురుగా వస్తే సముద్రంలో కలిపేస్తామని అన్నారు.
ఒంగోలు వైసీపీ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం జగన్ అంటే ప్రజలకు ఓ నమ్మకమని, వైఎస్ఆర్ ఆశయాలకు అనుగుణంలో సీఎం జగన్ పాలన సాగించాడని కొనియాడారు. గతంలో రైతులను, అక్కచెల్లెమ్మలను మోసం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో 175కి 175 స్థానాలను గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు.
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ..వచ్చే ఎన్నికల్లో వైసీపీ సత్తా ఏంటో చూపిస్తామన్నారు. జగన్‌ను ఎదుర్కొనే దమ్ము లేక పొత్తులు పెట్టుకున్నారని, ఎంత మంది కలిసి వచ్చినా జగనే మరోసారి సీఎం అవుతారన్నారు. మరో 45 రోజుల్లో ఎన్నికలు రానున్నాయని, జగన్ రుణం తీర్చుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. మరోసారి జగన్‌ను గెలిపించుకోవడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు.