మంగళగిరి బరిలోకి ఆ చిరంజీవి! ఇలా చేస్తే ‘ఆళ్ల’కి మండదా అండి!
X
అసెంబ్లీ ఎన్నికల ముందు సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. తన మాట జవదాటడని అనుకున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి ఝలక్ ఇచ్చారు. మంగళగిరి ఎమ్మెల్యే పదవితోపాటు పార్టీ సభ్యత్వానికి కూడా గుడ్ బై చెప్పారు. తాను రాజకీయాలకు సరిపోనని, పార్టీలో జరుగుతున్న పరిణామాలు తనను ఇబ్బంది పెట్టాయని ఆళ్ల అన్నారు.
ఒకప్పుడు జగన్‌కు అత్యంత సన్నిహితంగా మెగిలిన ఆళ్ల హఠాత్తుగా పార్టీకి దూరంగా కావడానికి కారణమేంటి? వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ దక్కదనే అనుమానంతోనే పక్కకు తప్పుకున్నారా? వేరే పార్టీలో పాగా వేయడానికి ప్రయత్నిస్తున్నారా? లేకపోతే అధిష్టానాన్ని హెచ్చరించి తన దారికి అడ్డంకులు లేకుండా చేసుకోవడానికి వ్యూహాత్మకంగా ప్రయత్నిస్తున్నారా? ఆయన నిర్ణయానికి ఇవన్నీ కారణాలు కావచ్చని చర్చ జరుగుతోంది.
2014, 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి గెలిచిన ఆళ్ల పార్టీలో తనకు ప్రాధాన్యం తగ్గుతోందని భావిస్తున్నారు. 2019 ఎన్నికల సమయంలో టీడీపీ నేత నారా లోకేశ్ బాబుపై గెలిస్తే మంత్రి పదవి ఇస్తానని జగన్ ఆయనకు హామీ ఇచ్చారు. మళ్లీ ఎన్నికలు వస్తున్నా ఆ హామీ నిలబెట్టుకోదు. మరోపక్క మంగళగిరిలో ఆళ్ల ప్రత్యర్థులు అధిష్టానికి దగ్గరయ్యారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన మాజీ టీడీపీ నేత గంజి చిరంజీవిని మంగళగిరి వైసీపీ ఇన్ చార్జిగా నియమించారు. ఎన్నికల్లో పార్టీ టికెట్ చిరంజీవికే ఇస్తారని ప్రచారం జరుగుతోంది.
ఇన్నేళ్ల నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉన్న తనను కాదని చిరంజీవిని అందలమెక్కించడంపై ఆళ్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) చైర్మన్‌గా పనిచేసిన ఆళ్లకు.. రాజధానిని విశాఖపట్నానికి తరలించడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. ప్రభుత్వం స్థానికుల రాజధాని ఆశలపై నీళ్లు చల్లడం ఆయనకు ఇబ్బందికరంగా మారింది. ఈ నిర్ణయం వచ్చే ఎన్నికల్లో తనను దెబ్బతీస్తుందని భయపడుతున్నారు. టీడపీ టాప్ లీడరైన లోకేశ్‌ను ఓడించిన తనకు మంత్రి పదవి ఇవ్వకపోగా ఇలాంటి నిర్ణయాలతో ఇబ్బందిపెడుతున్నారని వాపోతున్నారు. మారిన పరిణమాలు జీర్ణం కాని ఆళ్ల కొన్ని నెలలుగా పార్టీ కార్యక్రమాలకు, ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
టీడీపీలో పనిచేసిన గంజి చిరంజీవి 2002లో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరీచేరగానే జగన్ ఆయనకు చేతన విభాగం బాధ్యతలు అప్పగించారు. మంగళగిరి మున్సిపల్ చైర్మన్‌గా పనిచేసిన చిరంజీవికి బీసీ సామాజిక వర్గంలో మంచి పలుకుబడి ఉంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డికి చిరంజీవి గట్టి పోటీ ఇచ్చారు. చిరంజీవిపై ఆళ్ల కేవలం 12 ఓట్ల తేడాతో గెలిచారు. వచ్చే ఎన్నికల్లో చిరంజీవికి టికెట్ ఇస్తే బీసీల ఓటు బ్యాంకు కొల్లగొట్టి టీడీపీకి చెక్ పెట్టాలన్నది అధికార పార్టీ వ్యూహం. అదే జరిగితే ఆళ్ల రాజీకీయానికి తెరపడినట్టే.