తీగ దొరికింది..డొంకంతా కదలాల్సిందే...పేర్ని నాని
X
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు జైలుకు వెళ్లడంతో ఆంధ్రప్రదేశ్లో కాక రేపుతోంది. బాబుకు రిమాండ్ విధించడాన్ని నిరసిస్తూ టీడీపీ నేతలు ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా బంద్ నిర్వహిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో టీడీపీ నేతలు నిరసనలు చేపడుతున్నారు. పోలీసులు పరిస్థితిని అదుపులో ఉంచేందుకు ఎక్కడికక్కడ తెలుగుతమ్ముళ్లను అరెస్టు చేస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు అరెస్టుపై తాజాగా వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని స్పందించారు. ఈ కేసుతో తీగ దొరికిందని ఇక డొంకంతా కదలాల్సిందేనని, ఈ స్కామ్లో ఎవరెవరు ఉన్నారో అందరూ బయటికి వస్తారని పేర్ని నాని మీడియా ముఖంగా తెలిపారు.
మీడియాతో పేర్ని నాని మాట్లాడుతూ..." ఈ కేసు ఒక తీగ మాత్రమే. ఇక డొంకంతా కదిలి తీరుతుంది. సరైనోడి చేతికి చంద్రబాబు చిక్కారు. ఈ స్కామ్లో ఎవరెవరు ఉన్నారో అందరూ బయటికి వస్తారు. మేము చట్ట ప్రకారమే వెళ్తున్నాం. ఎక్కడా చట్టాన్ని మితిమీరడం లేదు. చట్ట ప్రకారమే నోటీసులు ఇచ్చాం. ఎఫ్ఐఆర్ కాపీలో చంద్రబాబు పేరు లేకపోతే ఏం అవుతుంది? అరెస్టు చేస్తారనే సమాచారం చంద్రబాబుకు ముందే ఉంది. రెండు రోజులుగా మీ వేషాలు చూడలేక చస్తున్నాం. మనోడైతే దొంగతనాలు చేసినా పట్టుకోకూడదా? 45 ఏళ్లుగా చంద్రబాబు ఎన్నో అవినీతి పనులు చేశారు. ఇన్నాళ్లు స్లీపర్ సెల్స్ ద్వారా వ్యవస్థలను మ్యానేజ్ చేశారు.
బాబు అరెస్టు అయినప్పటి నుంచి సీఐడీ అధికారులు ఎంతో మర్యాదగా ఆయన్ని చూశారు. రూ. 371 కోట్లు దొంగిలించిన నేరస్థుడిగా మిమ్మల్ని ఎక్కడ చూశారు? మిమ్మల్ని ఎక్కడ అవమానించారు? ఓ మాజీ సీఎంగా, ఓ ప్రతిపక్షనాయకుడిగా మిమ్మల్ని చాలా మర్యాదగా చూశారు. హెలికాప్టర్లో రమ్మంటే కారులోనే వస్తానని చెప్పింది మీరే. మీరే చెప్పిన తరువాత కక్ష సాధింపేంటి? మీ అబ్బాయి, భార్య, కుటుంబసభ్యులు అందరితో కలిసేందుకు అనుమతించారు. డీఐజీ స్థాయి అధికారిపై రంకెలు, నోటికొచ్చినట్లు మాటలా. చంద్రబాబు ఎన్ని అన్నా డీఐజీ సౌమ్యంగా మాట్లాడారు. అధికారులు ఎంతో పద్ధతిగా ప్రశ్నలు అడిగారు. మీరు మాత్రం ఏమో, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను అని సమాధానం చెప్తారా? జూనియర్ ఎన్టీఆర్ పడకపోయినా, సీఐడీ అధికారులకు మాత్రం ఆయన డైలాగులు చెప్తారా" అని పేర్ని నాని ప్రశ్నించారు.