పవన్ కల్యాణ్ డేటా కేసీఆర్ వద్ద ఉంది :పేర్నినాని
X
పవన్ కల్యాణ్‌పై మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్నినాని ఫైర్ అయ్యారు. ఏపీ ప్రభుత్వం డేటా చౌర్యం చేస్తుందన్న పవన్ వ్యాఖ్యలను ఖండించారు. డేటా చౌర్యంపై విచారణకు సిద్ధమని సవాల్ విసిరారు. బీజేపీతో బంధం ఉందని చెబుతున్న పవన్...కేంద్ర దర్యాఫ్తు సంస్థతో విచారణ జరిపించాలని, దానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు.
ప్రజాధికారిక సర్వే పేరుతో చంద్రబాబు డేటాచోరీ చేస్తే ఏమైపోయావని పేర్నినాన్ని ప్రశ్నించారు. ఆ డేటాను హైదరాబాద్ కు పంపిస్తే తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. అసలు పార్టీ సభ్యత్వం పేరుతో పవన్ సేకరిస్తున్న డేటాను ఎవరికిస్తున్నాడో చెప్పాలని డిమాండ్ చేశారు. సభ్యత్వం కోసం ఫోన్ నెంబర్, ఓటర్ ఐడీ, ఈమెయిల్ ఎందుకన్నారు.
పవన్ కల్యాణ్ హాలీ డే ట్రిప్పు కోసం ఏపీకి వచ్చి పిచ్చి వాగుడు వాగుతున్నారని మండిపడ్డారు. సినిమాల్లో కాకుండా బయటకూడా వేషాలు వేస్తున్నారని ఎద్దేవ చేశారు. పవన్, చంద్రబాబు డేటా అంతా కేసీఆర్ వద్ద ఉందని పేర్నినాని చెప్పారు. అమిత్ షాతో పవన్ మాట్లాడితే ఏంటి గొప్ప అన్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి జగన్ ప్రభుత్వాన్ని దమ్ముంటే ఇంటికి పంపించాలని సవాల్ విసిరారు. "అఖండ ప్రజలు కోరుకుంటే ఎన్డీయే అధికారంలోకి వస్తుందని పవన్ చెబుతున్నారు, అఖండ ప్రజలు అంటే ఎవరు? అఖండ సినిమానా? " అని పేర్నినాని ఎద్దేవా చేశారు.