Vasantha Krishna prasad:చంద్రబాబును తిడితేనే పదవులు.. ప్రశ్నించినందుకే పక్కనెట్టారు
X
తాను వైసీపీకి వ్యతిరేకం కాదని, తనకు పార్టీ మారే ఆలోచన లేదని ఎన్నోసార్లు చెప్పినా.. అధిష్టానం తనను పట్టించుకోలేదన్నారు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ( MLA Vasantha Krishnaprasad). పార్టీలో కొందరు ఉద్దేశపూర్వకంగానే మైలవరం నియోజకవర్గంలో గ్రూపులను ప్రోత్సహించారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం గ్రామంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం ఎన్నోసార్లు అడిగానని, తాను ఎన్ని ప్రతిపాదనలు ఇచ్చినా అవేవీ పట్టించుకోలదేన్నారు. సీఎం నుంచి మైలవరం కోసం ఒక్క రూపాయీ సాధించలేకపోయానని అన్నారను. నియోజకవర్గంలో అభివృద్ధికి ఏమీ చేయలేకపోవడంతో తనలో అంతర్మథనం మొదలైందని, పార్టీలో అవమానాలు ఎదురవుతున్నా ఏడాదిగా సహించానన్నారు.
రాజధాని గురించి సీఎ జగన్ ఎన్నికలు ముందు హామీ ఇచ్చి.. ఎన్నికల తర్వాత మాట మార్చారన్నారు. మూడు రాజధానుల బిల్లు పెట్టిన రోజే పార్టీ మీటింగ్ పెట్టి.. తమను బిల్లును సమర్థించాలని చెప్పారన్నారు. దీనిపై పార్టీకి తీవ్రంగా నష్టం జరుగుతుందని చెప్పానని, తప్పనిసరైతే సెక్రటేరియట్ అయినా ఇక్కడే ఉంచాలని కోరానన్నారు. "కక్ష సాధింపు చర్యలతో ఏమీ సాధించలేరు. అధికారం ఉందని అహంకారం ప్రదర్శించకూడదు. చంద్రబాబును తిడితే పదవులు ఇస్తామంటే ఎలా అని ప్రశ్నించా. మనసు గాయపడ్డాక నిలువెత్తు బంగారం ఇస్తానన్నా వెనక్కి వెళ్లను. కొత్త ఇన్‌ఛార్జిని నియమించాక రాజకీయాలకు స్వస్తి పలుకుదామనుకున్నా. రాజకీయాల నుంచి వెళ్లొద్దని నా అనుచరులు, అభిమానులు చెప్పారు. వారితో మాట్లాడి త్వరలో నిర్ణయం తీసుకుంటా’’ అని వసంత కృష్ణప్రసాద్ అన్నారు.