జనసేనలో చేరిన వైసీపీ ఎమ్మెల్సీ.. పవన్ కోసం..
X
వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైసీపీని వదిలి జనసేన పార్టీలో చేరారు. ఆయనకు పవన్ కల్యాణ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన వంశీకృష్ణ.. తాను ఏ పార్టీలో ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానినే అని తెలిపారు. పవన్ ఆలోచనలు నచ్చి జనసేనలో చేరినట్లు చెప్పారు. అందరినీ కలుపుకుని ముందుకు సాగుతూ.. జనసేన బలోపేతానికి తనవంతు కృషి చేస్తానన్నారు. వైసీపీలోని కొన్ని శక్తుల వల్లే ఆ పార్టీని వీడినట్లు స్పష్టం చేశారు.
గతంలో పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ప్రజారాజ్యం యువజన విభాగంలో పనిచేశానని.. ఇప్పుడు మళ్లీ ఆయన ఆధ్వర్యంలో పనిచేసే అవకాశం రావడం సంతోషంగా ఉందని వంశీకృష్ణ తెలిపారు. పవన్ కల్యాణ్ను సీఎంగా చేసేందుకు సర్వశక్తులు ధారపోస్తానన్నారు. మున్ముందు మరింత మంది నాయకులు జనసేనలో చేరుతారని చెప్పారు. కాగా వంశీ కృష్ణ బలమైన నాయకుడని.. గతంలో యువరాజ్యంలో కలిసి పనిచేశామని పవన్ చెప్పారు. యువరాజ్యంలో పనిచేసిన చాలా మంది నాయకులు తెలుగు రాష్ట్రాల్లో బలమైన నాయకులుగా ఎదగడం ఆనందంగా ఉందన్నారు. సొంత కుటుంబంలోకి వంశీ కృష్ణకు స్వాగతం పలుకుతున్నట్లు స్పష్టం చేశారు.