Home > ఆంధ్రప్రదేశ్ > పార్లమెంట్పై దాడి.. నిందితుడ్ని చితకబాదిన వైసీపీ ఎంపీ.. వీడియో

పార్లమెంట్పై దాడి.. నిందితుడ్ని చితకబాదిన వైసీపీ ఎంపీ.. వీడియో

పార్లమెంట్పై దాడి.. నిందితుడ్ని చితకబాదిన వైసీపీ ఎంపీ.. వీడియో
X

దేశ అత్యున్నత చట్టసభలో భద్రతా వైఫల్యం బయటపడింది. లోక్ సభ సమావేశాలు జరుగుతున్న సమయంలో గ్యాస్ దాడి కలకలం రేపుతోంది. పార్లమెంటులోకి చొరబడి గ్యాస్ వదలడం అక్కడి భద్రతా వైఫల్యాన్ని కళ్లకు కడుతోంది. జీరో అవర్ జరుగుతున్న సమయంలో విజిటర్స్ గ్యాలరీ నుంచి సభలోకి దూకిన ఆగంతకుడు అలజడి సృష్టించాడు. ఎవరూ పట్టుకునే వీలులేకుండా టేబుళ్లపై ఎక్కి అటూ ఇటు పరిగెత్తాడు. ఈ క్రమంలో ఎంపీలను భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన స్పీకర్ సభను వాయిదా వేశారు. మరోవైపు ఎంపీలంతా భయంతో బయటకు పరుగులు తీశారు. మరికొందరు ఎంపీలు దుండగుడ్ని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వైసీపీ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ సభలోని బెంచ్ లపై నుంచి దూకుతూ వచ్చి దుండగుడిని చితకబాదాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ సందర్భంగా మాట్లాడిన గోరంట్ల.. కొత్త పార్లమెంట్ ఎత్తు తగ్గించడం వల్లే దుండగులు సులభంగా సభలోకి ప్రవేశించారని అన్నారు. విజిటర్స్ గ్యాలరీకి గ్లాస్ బిగిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నారు. ఇది కచ్చితంగా భద్రతా వైఫల్యమేనని అన్నారు. స్పీకర్ చైర్ వైపు దూసుకొచ్చిన దుండగుడు దాడి చేసే ప్రయత్నం చేశాడని, తాను ఎదురెళ్లి పట్టుకున్నానని చెప్పారు. పట్టుకున్న వెంటనే తన బూట్ల నుంచి కలర్ గ్యాస్ బయటికి తీశాడని గోరంట్ల చెప్పుకొచ్చారు.

మరోవైపు పార్లమెంటు బయట కూడా ఇద్దరు ఆందోళనకారులు వీరంగం సృష్టించారు. ఓ పురుషుడితో పాటు మహిళ కలర్ స్మోక్ తో నిరసనకు దిగారు. వెంటనే అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు ట్రాన్స్పోర్ట్ భవన్ వద్ద వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. దాడికి పాల్పడిన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని హర్యానా, మహారాష్ట్ర, కర్నాటకలకు చెందిన వారిగా గుర్తించారు. నిందితుల్లో నీలం ఓ మహిళ కూడా ఉంది. ఆమె స్వస్థలం హర్యానాలోని హిస్సార్. ఆమెతో పాటు పట్టబడిన అమోల్ షిండే స్వస్థలం మహారాష్ట్రలోని లాతూర్. మరో ఇద్దరు నిందితులు సాగర్ శర్మ, మనోరంజన్‌ల సొంతూరు కర్నాటకలోని మైసూర్. గతంలో పార్లమెంటుపై లష్కరే తోయిబా ఉగ్రవాదులు దాడి జరిపిన రోజునే ఈ దాడి జరగడం మరింత ఆందోళన కలిగిస్తోంది. 22 ఏళ్ల కిందట.. 2001 డిసెంబర్ 13న జరిగిన ఉగ్రవాదుల దాడిలో 9 మంది చనిపోయారు. అప్పట్నుంచి డిసెంబర్ 13న యానివర్సరీగా పాటిస్తూ భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తున్నాయి. అయినప్పటికీ దుండగులు భద్రతా సిబ్బంది కళ్లుగప్పి లోక్‌సభలోకి గ్యాస్ కేన్లతో చొరబడ్డారు.




Updated : 13 Dec 2023 6:10 PM IST
Tags:    
Next Story
Share it
Top