Vijayasai Reddy:గుర్తింపు లేని జనసేనని సమీక్షకు ఎలా పిలిచారు.. ??
X
తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు, ఏపీలో పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు ఒకే రోజున జరపాలని వైసీపీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులను కలిసిన వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి... టీడీపీ ఇల్లీగల్ ఓటర్ ప్రొఫైలింగ్ చేస్తుందని వారికి ఫిర్యాదు చేశారు. తెలంగాణలో ఓటర్లుగా నమోదయిన వారంతా ఇక్కడ కూడా నమోదు చేసుకున్నారని, రెండు చోట్ల ఓటు వేయకుండా నిరోధించాలని తాము ఎన్నికల కమిషన్ ను కోరామని తెలిపారు. తెలంగాణలో ఓటు వేసిన తన అనుచరులతో ఆంధ్రప్రదేశ్ లోనూ ఓటు వేయించేందుకు తెలుగుదేశం పార్టీ ప్లాన్ చేసిందని, దీన్ని నివారించాలంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజు పోలింగ్ జరపాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్లు పార్టీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి చెప్పారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తో మంగళవారం భేటీ అయిన అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడారు. జనసేన గుర్తింపు లేని పార్టీ అని, ఆ పార్టీని కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించిన సమీక్షకు ఎలా అనుమతించారని ఆయన ప్రశ్నించారు. తాము ఆరు అంశాలపై సిఇసికి ఫిర్యాదు చేసామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది బోగస్ ఓట్లు ఉన్నాయంటూ టిడిపి ఫిర్యాదు చేసిందనీ, కానీ ఓటర్ల జాబితాలను కలెక్టర్లు సరిచూసి ఏ జిల్లాలోనూ బోగస్ ఓట్లు లేవని స్పష్టం చేశారని విజయసాయి రెడ్డి చెప్పారు. తప్పుడు ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలపై చర్య తీసుకోవాలని తాము ఎన్నికల సంఘం అధికారులను కోరామన్నారు. వైఎస్సార్ సిపికి సహకరించే అధికారుల పేర్లను రెడ్ బుక్ లో రాస్తున్నాననీ, టీడీపీ అధికారంలోకి వచ్చాక వారిపై చర్యలు తీసుకుంటామని లోకేష్ బెదిరిస్తున్నాడని ఆయన ఆరోపించారు.