వైసీపీపై చిరు కామెంట్స్...సీన్లోకి విజయసాయి రెడ్డి
X
సినీ పరిశ్రమపై ప్రభుత్వాలు మాట్లాడటం తగదని, అభివృద్ధిపై దృష్టి పెట్టాలని మెగస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై రచ్చ కొనసాగుతోంది. మెగాస్టార్ పై వైసీపీ నాయకులు తీవ్ర పదజాలంతో విరుచుకుపడుతున్నారు. తాజాగా ఎంపీ విజయసాయి రెడ్డి సీన్ లోకి ఎంట్రీ ఇచ్చారు. వరుస ట్వీట్లతో చిరంజీవికి కౌంటర్ ఇచ్చారు. "సినీ రంగమేమీ ఆకాశం నుంచి ఊడి పడలేదు. ఫిలిం స్టార్స్ అయినా పొలిటిషియన్స్ అయినా ప్రజలు ఆదరిస్తేనే వారికి మనుగడ. సినీ పరిశ్రమలోని పేదలు, కార్మికుల సంక్షేమం బాధ్యత కూడా ప్రభుత్వానిదే. వాళ్ళూ మనుషులే. వారి గురించి మీకెందుకు, వీరి గురించి ప్రభుత్వానికి ఎందుకంటే కుదరదు. వారి యోగక్షేమాల పట్టించుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉంది" అని విజయసాయి రెడ్డి తెలిపారు.
ఈ ట్వీట్ చేసిన కాసేపటికే మరో ట్వీట్ చేశారు. "కొందరు సినిమా హీరోలు పాపం చాలా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకొంటూ, వీలైతే ఉచితంగా నటిస్తూ....లక్షలాది డైలీ వేజ్ సినీ కార్మికులను బతికిస్తున్నారు. కళామతల్లిపై ప్రేమతో ఎక్కువ సినిమాలు చేస్తున్నారు. తలసరి ఆదాయం, స్థూల రాష్ట్ర ఉత్పత్తి వృద్ధి కోసం అహర్నిశలూ చెమటోడుస్తున్నారు. అలాంటి వారికి హాట్సాఫ్" అని కీలక వ్యాఖ్యలు చేశారు.
వాల్తేరు వీరయ్య 200 రోజుల వేడుకలో చిరంజీవి కీలక వ్యాఖ్యలు దుమారం రేపాయి. రాజకీయా నాయకులతో పోల్చకుంటే సినిమా చాలా చిన్నది అని చెప్పారు. సినిమా వాళ్ల రెమ్యూనరేషన్ గురించి పార్లమెంట్లో మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు. వ్యాపారం జరుగుతుంది కాబట్టే సినిమాలు చేస్తున్నామని..అందుకే తమకు డబ్బులు ఇస్తున్నారని చెప్పారు. రాజకీయాలకు సినిమాను దూరంగా ఉంచాలని విజ్ఞప్తి చేశారు. తమ కష్టాలు ఏవో తాము పడతామని చిరంజీవి వ్యాఖ్యానించారు. వీలైతే ప్రభుత్వాలు సహకరించాలి తప్ప, అణగదొక్కాలని చూడొద్దని విన్నవించుకున్నారు. ప్రత్యేక హోదా, ప్రాజెక్టు, రోడ్ల నిర్మాణం, ఉద్యోగ అవకాశాలు వంటి అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రయత్నిస్తే ప్రతి ఒక్కరం తలొంచి నమస్కరిస్తామని మెగాస్టార్ కామెంట్స్ చేశారు. దీనిపై వైసీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.