Home > ఆంధ్రప్రదేశ్ > CM Jagan : వైసీపీ ఏడో జాబితా రిలీజ్.. అభ్యర్థులు వీరే

CM Jagan : వైసీపీ ఏడో జాబితా రిలీజ్.. అభ్యర్థులు వీరే

CM Jagan : వైసీపీ ఏడో జాబితా రిలీజ్.. అభ్యర్థులు వీరే
X

వైసీపీ ఏడో జాబితాను విడుదల చేసింది. ప్రకాశం జిల్లా పర్చూరుకు యడం బాలాజీ, కందూకూరుకు కటారి అరవిందా యాదవ్‌ను నియమించింది. ఈ మేరకు కేంద్ర కార్యలయం ఉత్తర్వులిచ్చింది. ఇప్పటి వరుకు ఆరు విడతల్లో 63 అసెంబ్లీ, 16 లోక్ సభ సీట్లకు ఇన్‌ఛార్జులను నియమించిన సంగతి తెలిసిందే. కందుకూరు బాధ్యతల్ని తిరుపతి జిల్లా గూడూరుకు చెందిన పెంచలయ్య కుమార్తె అరవింద యాదవ్‌‌కు అప్పగించారు. కందుకూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే మానుగుంట మహిధర్‌ రెడ్డిని కాదని తిరుపతి జిల్లా గూడూరు నుంచి ఇటీవలే పార్టీలో చేరిన పెంచలయ్య కుమార్తెకు టికెట్ ఇవ్వడం గమనార్హం. పర్చూరు బాధ్యతలను ఆమంచి నుంచి తప్పించి చీరాలకు చెందిన యడం బాలాజీని ఇంఛార్జ్‌గా నియమించారు. యడం బాలాజీ 2014లో చీరాల వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. 2019లో ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వకపోవడంతో ఆయన తెలుగు దేశం పార్టీలో చేరారు. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న ఆయన్ను ముఖ్యమంత్రి జగన్‌ పిలిపించుకుని మరీ వైఎస్సార్‌సీపీలోకి చేర్చుకుని పర్చూరు టికెట్ ఇచ్చారు. ఈ రెండు నియోజకవర్గాల్లో మార్పులు, చేర్పులు ఆసక్తికరంగా మారాయి. పర్చూరు ఇంఛార్జ్‌ బాధ్యతల నుంచి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ను తప్పించడం ఆసక్తికరంగా మారింది.

ఆమంచికి ఏ సీటు ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. కృష్ణమోహన్‌ పర్చూరులో పోటీచేయడానికి ఆసక్తిగా లేరు.. ఇప్పటికే అధిష్టానం పెద్దల్ని కలిసి చెప్పారు. తనకు చీరాల నుంచి అవకాశం ఇవ్వాలని పదే, పదే కోరారు. ఈ సమయంలో పర్చూరు నుంచి తప్పించడం చర్చనీయాంశమైంది. ఆయనకు ఎక్కడ అవకాశం ఇస్తారనే చర్చ జరుగుతోంది. ఒకవేళ చీరాల నుంచి పోటీ చేయాలంటే అక్కడ కూడా పోటీ ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కరణం బలరాం రేసులో ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో తనకు బదులుగా, తన కుమారుడు వెంకటేష్‌కు అవకాశం ఇవ్వాలని కోరారు. దీంతో గతంలోనే వెంకటేషన్‌ను చీరాల వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్‌‌గా నియమించారు. అయితే చీరాల వ్యవహారంపై ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన మాత్రం రాలేదు. తొలి జాబితాలో 11 అసెంబ్లీ స్థానాలకు కొత్త సమన్వయకర్తలను ప్రకటించగా…. రెండో జాబితాలో 27 మంది పేర్లను ప్రకటించారు. మూడో జాబితాలో 21, నాల్గో జాబితాలో 8 మంది, ఐదో జాబితాలో 7 మందిని కొత్తగా ప్రకటించారు. ఆరో జాబితాలో 10 స్థానాలకు సమన్వయకర్తలను ప్రకటించారు. వీటిలో కొన్ని పార్లమెంట్ స్థానాల ఇంఛార్జులు కూడా ఉన్నారు.




Updated : 17 Feb 2024 8:40 AM IST
Tags:    
Next Story
Share it
Top