ఇకపై యూట్యూబ్ వీడియోలు చేయను - యూట్యూబర్ అన్వేష్
X
యూట్యూబ్ వీక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు ట్రావెల్ కమ్యూనిటీలో నెంబర్ వన్ యూట్యూబర్. అతను చేసే వీడియోల పాపులారిటీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నాలుగేళ్లలోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి సుపరిచితుడైన ఆయనే నా అన్వేషణ యూట్యూబ్ ఛానెల్ ఓనర్ అన్వేష్ . యూట్యూబ్ ద్వారా నెలలో రూ. 30లక్షలు సంపాదించి రికార్డులు బ్రేక్ చేసిన ఆయన తాజాగా బాంబు పేల్చాడు. యూట్యూబ్ వీడియోలు ఆపేస్తున్నానంటూ తన ఛానెల్లో ఓ వీడియో పోస్ట్ చేశాడు.
కరోనా టైంలో జాబ్ పోవడంతో అన్వేష్ యూట్యూబ్ వీడియోలు తీయడం మొదలుపెట్టాడు. తొలుత ఇండియాలో చూడదగ్గ ప్రదేశాలకు వెళ్లి ఆ వీడియోలు యూట్యూబ్ లో పోస్ట్ చేశాడు. వాటికి వ్యూయర్షిప్ బాగానే ఉండటంతో ప్రపంచ యాత్ర మొదలుపెట్టాడు. ఒక్కో దేశం తిరుగుతూ సబ్ స్క్రైబర్లకు అక్కడి ప్రదేశాలను, ప్రజల అలవాట్లను చూపడం మొదలుపెట్టాడు. ఛానెల్ పెట్టి కొన్ని రోజుల్లోనే సక్సెస్ అయ్యాడు. అతని వీడియోలకు ఫిదా అయిన చాలా మంది సబ్ స్క్రైబ్ చేసుకున్నారు. ప్రస్తుతం నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్కు 1.92 మిలియన్ సబ్ స్క్రైబర్లు ఉన్నారు.
మనసులో ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం అన్వేష్ అలవాటు. అదే తనను ఇబ్బందుల్లో పడేసిందని అంటున్నాడు. తిండీతిప్పలు లేకుండా దేశాలు తిరుగుతూ వీడియోలు చేస్తుండటంతో పర్సనల్ లైఫ్ కోల్పోతున్నానని, కనీసం తినేందుకు టైం కూడా దొరకడం లేదని, హెల్త్ ఇష్యూస్ తో సతమతమవుతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. తన వీడియోల కారణంగా కొన్ని కంపెనీలు, తోటి యూట్యూబర్స్, మీడియా, రాజకీయ నాయకుల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అందుకే వీడియోలు ఆపేస్తున్నానంటూ 44 నిమిషాల వీడియో పోస్ట్ చేశాడు. తన వీడియో చూశాక సబ్స్క్రైబర్లు తమ అభిప్రాయాలను వెల్లడించాలంటూ చెప్పుకొచ్చాడు. 4 ఏండ్లుగా తనను ఆదరించి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పిన అన్వేష్.. తాను అప్ లోడ్ చేసిన 1200లకుపైగా ట్రావెల్ వీడియోలను చూడాలని కోరాడు. త్వరలోనే మంచి వీడియోలతో ముందు కొస్తానని చెప్పాడు.