YS Family: షర్మిల కుమారుడి వివాహ వేడుకకు జగన్ దూరం
X
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్ తనయుడి పెళ్లి వేడుకలు రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్‌లో ఘనంగా జరిగాయి. జోధ్‌పూర్ ప్యాలెస్‌లో రాజారెడ్డి, ప్రియ అట్లూరి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితులు మాత్రమే ఈ వివాహానికి హాజరయ్యారు. కాగా, ఈ వివాహ వేడుకలకు షర్మిల సోదరుడు, ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దూరంగా ఉన్నారు. మేనల్లుడి పెళ్లికి మేనమామ జగన్ హాజరుకాకపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. రాష్ట్ర అభివృద్ధి పనుల దృష్ట్యా పెళ్లికి హాజరుకాలేదా? లేదా మరేతర కారణమేదైనా ఉండి ఉంటుందా అని ఏపీ జనాలు చర్చించుకుంటున్నారు. అయితే అంతకుముందు కూడా నిశ్చితార్థ వేడుకకు హాజరైనప్పటికీ సీఎం జగన్ దంపతులతో షర్మిత కలివిడిగా ఉండలేకపోయారు. వేదికపై వారితో ముభావంగానే ఉన్నారు. జగనే .. మేనల్లుడైన వరుడు రాజారెడ్డికి, వధువు ప్రియా అట్లూరికి పుష్పగుచ్ఛం ఇచ్చి పలకరించి వెళ్లారు. ఇక పెళ్లి వేడుకకు అసలే దూరంగా ఉన్నారు. వధూవరులు జోధ్‌పూర్ నుంచి ఏపీకి వచ్చాక ముఖ్యమంత్రి స్వయంగా వారిని కలసి ఆశీర్వదిస్తారని ప్రచారం జరుగుతోంది.
Congratulations RajaPriya #RajaPriya #Haldi #wedding #happyforbothofyou ♥️ pic.twitter.com/qffN2ofJSq
— YS Sharmila (@realyssharmila) February 17, 2024
ఈ నెల 16 నుంచి 18 వరకు రాజారెడ్డి పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. వివాహ వేడుకలో భాగంగా 16వ తేదీన సంగీత్, మెహందీ కార్యక్రమం జరిగింది. శనివారం సాయంత్రం ఐదున్నర గంటలకు రాజారెడ్డి, ప్రియలు బంధుమిత్రుల సాక్షిగా ఒక్కటయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు షర్మిల సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. దీంతో ఈ ఫొటోలు వైరల్ అయ్యాయి. పెళ్లి ఫొటోలు బయటకు రాలేదు కానీ.. హల్దీ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రాజా రెడ్డి, ప్రియల ఇరుకుటుంబాలు ఈ ఫొటోలలో కనిపించారు. షర్మిల, ఆమె భర్త అనిల్ కుమార్, కూతురు అంజలి, తల్లి విజయమ్మ రాజా రెడ్డి పక్కన ఉండగా.. ప్రియ తల్లిదండ్రులు, ఆమె సోదరుడు మరోపక్క నిలబడి ఉన్న ఫొటో ఆకట్టుకుంటోంది. కాగా, ఫిబ్రవరి 18న ఉదయం 11 గంటలకు ప్రత్యేక ప్రార్థనలు జరగనున్నాయి. సాయంత్రం తలంబ్రాల వేడుక జరగనుంది.