Home > ఆంధ్రప్రదేశ్ > ఏపీలో షర్మిల పోటీ.. ఎవరికి లాభం? నష్టం!

ఏపీలో షర్మిల పోటీ.. ఎవరికి లాభం? నష్టం!

ఏపీలో షర్మిల పోటీ..  ఎవరికి లాభం? నష్టం!
X

తెలంగాణలో రాజకీయాలు నడిపి ఎన్నికల్లో చేతులెత్తేసిన వైఎస్సార్ కూతురు వైఎస్ షర్మిల ఆంధప్రదేశ్‌లో అదృష్టం పరీక్షించుకోడానికి వెళ్తున్నారు. ఆమె కాంగ్రెస్‌లో చేరడం, ఏపీలో పోటీ చేయడం లాంఛనమేనని తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకపోడంతో వైఎస్సార్ తెలంగాణ పార్టీ కథ ఇక ముగిసినట్టుగానే భావించాలి. ఆ పార్టీ కేడర్ షర్మిలపై విశ్వాసం లేక వేరే పార్టీలను చూసుకుంటున్నారు. ఆమె కూడా ఆ విషయాన్ని తీవ్రంగా తీసుకోవడం లేదు.

మరో నాలుగైదు నెలల్లో జరిగే ఏపీ ఎన్నికల్లో షర్మిల కాంగ్రెస్ నేతగా ఎంట్రీ ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. దీంతో వైఎస్ ముద్దుల కూతురు బరిలోకి దిగితే ఏ పార్టీకి నష్టం? ఏ పార్టీకి లాభమనే విశ్లేషణలు వెలువడుతున్నాయి.

ఏపీ రాజకీయాల్లోకి వైఎస్ షర్మిల ఎంట్రీ లాంఛనంగా కనిపిస్తోంది. షర్మిల రాకతో ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి మారుతుందని, ఓట్ల శాతం పెరుగుతుందని ఆ పార్టీ నేతలు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. షర్మిల ఎంట్రీతో ఎవరి ఓట్లు చీలుతాయని విశ్లేషణలు, అంచనాలు వెలువడుతున్నాయి. ఏపీలో కాంగ్రెస్2కు తిరిగి జీవం పోయడానికి అధిష్టానం ఆమెకు ఏపీ కమిటీ అధ్యక్ష పదవి కట్టబెట్టనుందని వార్తలు వస్తున్నాయి. జనవరిలో ఆమె ఢిల్లీ వెళ్లి తంతును ముగిస్తారని సమచారం. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు ఎన్ని ఒకేసారి జరుగుతుండడంతో షర్మిలకు బాధ్యతలు కీలక కట్టబెడతారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ఎన్నిక్ల్లో కనీసం 10 అసెంబ్లీ స్థానాలు, రెండో మూడో ఎంపీ సీట్లు కొల్లగొట్టాలని వ్యూహాలు రచిస్తున్నారు. ఇటీవల ఢిల్లీ వెళ్లిన ఏపీ కాంగ్రెస్ చీఫ్ రుద్రరాజుతో కాంగ్రెస్ పెద్దలు ఈ విషయం చర్చించినట్లు తెలుస్తోంది.

షర్మిల ఏపీలో కాంగ్రెస్‌కు సారథ్యం వహిస్తే వైఎస్సార్ పార్టీకి సమస్యలు ఎదురవుతాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై ఏపీ ప్రజల్లో ఇప్పటికీ ఉన్న సానుభూతి ఓట్ల రూపంలోకి మారుతుంది. ఆయన చనిపోయి పదిహేనేళ్లు కావొస్తున్నా కాంగ్రెస్ అభిమానుల హృదయాల్లో పదిలంగానే ఉన్నారు. వైఎస్సార్ సీపీ, టీడీపీల్లో దేన్నీ ఇష్టపడని ఓటర్లు షర్మిలవైపు మొగ్గు చూపొచ్చు. ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్ ప్రభావం కూడా కొంత ఉంటుంది. క్రైస్తవుల్లో ఓ సెక్షన్ జగన్‌కు దూరమై కాంగ్రెస్‌ను ఆదరించే అవకాశం ఉంటుంది. ఫలితంగా ముక్కోణపు పోటీ నెలకొంటుంది. టీడీపీ-జనసేన, వైపీసీ, కాంగ్రెస్‌ల మధ్య ప్రధానంగా పోటీ ఉంటుంది. బీజేపీ కూడా ఉనికిలో ఉన్నప్పటికీ దానికి కేడర్, నాయకులు లేకపోవడంతో ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు.

షర్మిల పోటీ వల్ల ప్రధానంగా వైసీపీకి నష్టం కలుగుతుంది. ఆమె తెలంగాణలో పనిచేసినట్లు ఏపీలోని ప్రచారాన్ని హోరెత్తిస్తే ఫలితాలు తారుమారు కావొచ్చు. కాంగ్రెస్ ఒక్కో నియోజక వర్గంలో 5 నుంచి 10 వేల ఓట్లను చీల్చే అవకాశం ఉంటుంది. అదే జరిగిందే వైసీపీ అభ్యర్థుల విజయావకాశాలు దెబ్బతిని, టీడీపీ-జనసేన అభ్యర్థులకు లాభం చేకూరుతుంది. కాంగ్రెస్‌తో దోస్తీ కోసం ప్రయత్నిస్తున్న చంద్రబాబు నాయుడు షర్మిలకు పూర్తి సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఎన్నికలకు నిధులు సమకూర్చడం, అభ్యర్థులను వ్యూహాత్మకంగా ఎంపిక చేయడం వంటి అంశాల్లో ఆయన కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుంది.

వైసీపీ ఐదేళ్ల పాలనలో సంక్షేమ పథకాలతో ప్రజలు కొంత మేలు జరిగినా లబ్ధి పొందని ప్రజలు ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయడం సహజం. 60 మందికిపైగా వైసీపీ సిట్టింగ్ ఎంపీలపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. వారి బదులు కొత్తవారికి టికెట్లు ఇవ్వడానికి జగన్ ప్రయత్నిస్తున్నారు. ఈ ఉపాయం.. పాత సీసాలో కొత్త సారాలా మారి బెడిసికొట్టొచ్చు కూడా. టీడీపీ-జనసేనల పోటీ, వాటికి బీజేపీ పరోక్ష సహకారం కూడా వైసీపీకి ఇబ్బందిగా మారింది. ఇన్ని సమస్యల మధ్య ఎంట్రీ ఇవ్వబోతున్న షర్మిలతో అన్నయ్య జగన్‌కు కష్టాలు తప్పకపోవచ్చు. ఆమె గెలుపోటలములను తీవ్రంగా ప్రభావితం చేయలేకపోయినా హంగ్ అసెంబ్లీ వంటి పరిస్థితులకు కారణం కావొచ్చు. చంద్రబాబు అరెస్ట్, లోకేశ్ పాదయాత్ర వంటి పరిణామాలతో టీడీపీ గ్రాఫ్ నెమ్మదిగా పైకి పెరుగుతున్న నేపథ్యంలో షర్మిల ప్రవేశం పచ్చ పార్టీకి లబ్ధి చేకూర్చే అవకాశం ఉంది. మరి షర్మిల సొంత అన్ననే దెబ్బతీయడానికి సిద్ధమవుతారా? తల్లి విజయమ్మ చూస్తూ ఊరుకుంటుందా? షర్మిల నాయకత్వాన్ని కాంగ్రెస్ నేతలు స్వాగతిస్తారా? వంటి ప్రశ్నలకు సమాధానాల కోసం ఎన్నికల వరకు వేచిచూడాల్సిందే..

Updated : 31 Dec 2023 8:31 PM IST
Tags:    
Next Story
Share it
Top