మూడు రాజధానుల పేరుతో జగనన్న పేకముక్కలాట ఆడాడు: వైఎస్ షర్మిల
X
హైదరాబాద్ ను మరో రెండేళ్లు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని కోరుతూ.. వైసీపీ నేతలు చేసిన వాఖ్యలకు ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కౌంటర్ వేశారు. ఐదేళ్ల పాలనలో రాజధానిని నిర్మించకపోవడం.. ఇప్పుడు హైదరాబాద్ ను మళ్లీ అడగటం వైసీపీ నేతల చేతకాని తనానికి నిదర్శనం అని మండిపడ్డారు. ఇన్నాళ్లు గుడ్డి గుర్రాలకు పళ్లు తోమారా..? మీ చేతకాని తనానికి ఇప్పుడు ఉమ్మడి రాజధాని అడుగుతున్నారా..? ఐదేళ్లు అధికారమిస్తే విభజన హామీల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు కాలేదన్నారు. రాష్ట్రానికి రాజధాని లేదని, ప్రత్యేక హోదా ఇవ్వలేదని ఫైర్ అయ్యారు.
ఏపీకి ఇప్పటివరకు ప్రత్యేక ప్యాకేజీలు రాలేదని, పోలవరం ఇన్నేళ్లైనా పూర్తి కాలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో కనీసం జలయజ్ఞం పెండింగ్ ప్రాజెక్టులకు దిక్కులేదని షర్మిల ఆరోపించారు. ఇన్నేళ్లలో ఒక్క కొత్త పరిశ్రమ రాలేదని, ప్రస్తుతం ఉన్నవి ఉంటాయో లేదో తెలియదని విమర్శలు గుప్పించారు. రూ. 8లక్షల కోట్ల అప్పులు చేసి.. రాష్ట్రాన్ని అప్పుల పాలుజేశారే తప్ప అభివృద్ధి మాత్రం ఏం చేయలేదని షర్మిల ఆరోపించారు. ఢిల్లీకి వెళ్లిన ప్రతీసారి మోదీకి మోకరిళ్లారే కానీ.. విభజన హామీలేనాడు అడగలేదని అన్నారు. ఏపీ రాజధాని ఏదీ అని అడిగితే.. మరో పదేళ్ల తర్వాత కూడా హైదరాబాద్ వైపు చూపించే దయనీయ పరిస్థితి ఎదురైందని మండిపడ్డారు. అమరావతి పేరుతో చంద్రబాబు 3డీ గ్రాఫిక్స్ చూపిస్తే.. మూడు రాజధానుల పేరుతో జగనన్న పేకముక్కలాట ఆడాడని షర్మిల ఎద్దేవా చేశారు.