కాంగ్రెస్ సరికొత్త ప్లాన్.. ఏపీ కాంగ్రెస్ చీఫ్గా రాజన్న బిడ్డ..?
X
ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. మరో మూడు, నాలుగు నెలల్లో ఎన్నికలు జరగనుండడంతో రాజకీయ వేడి రాజుకుంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. అధికార వైసీపీ పార్టీ పార్టీ ఇంచార్జులను మార్చడంతో పాటు చాలా మంది సిట్టింగులకు టికెట్లు కట్ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. అటు టీడీపీ కూడా ఇటీవల ప్రశాంత్ కిషోర్ తో సమావేశమై సరికొత్త వ్యూహాలను రచిస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
వైఎస్పార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిలను ఏపీ కాంగ్రెస్ చీఫ్గా నియమించాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో షర్మిల కాంగ్రెస్ పార్టీకి మద్ధతు ప్రకటించి.. ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంది. కాంగ్రెస్లో వైఎస్సార్టీపీ విలీనం అంటూ అప్పట్లో జోరుగా చర్చ నడిచింది. రాహుల్, సోనియా గాంధీలతోనూ షర్మిల భేటీ అయ్యారు. పలుసార్లు డీకే శివకుమార్ను సైతం కలిశారు. అయితే పలు కారణాలతో కాంగ్రెస్లో వైఎస్సార్టీపీ విలీనం ఆగిపోయింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి.. అధికారాన్ని చేపట్టింది. ఇదే జోష్లో ఏపీలోనూ సత్తా చాటాలని ఆ పార్టీ ప్రణాళికలు రచిస్తోంది.
ఏపీలో కాంగ్రెస్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఏపీ విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ కనీసం ఒక్క సీటును కూడా సాధించలేకపోయింది. ఈ క్రమంలో ఈ సారి చెప్పుకోదగ్గ సీట్లన్న సాధించాలని ప్లాన్ వేస్తోంది. ఏపీ పగ్గాలను వైఎస్ షర్మిలకు అప్పగిస్తే పార్టీ పుంజుకుంటుందని భావిస్తోంది. వైఎస్సార్ చరిష్మాతో ఆయన బిడ్డగా షర్మిల పేరు పార్టీకి కలిసొస్తుందని లెక్కలు వేస్తోంది. దీనికి సంబంధించి చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే, రాహుల్, సోనియా గాంధీలతో షర్మిల చర్చలు జరిపారని సమాచారం. ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా కొత్తగా బాధ్యతలు చేపట్టిన మాణిక్కం ఠాగూర్ ఈ అంశంపై ప్రత్యేక నజర్ పెట్టినట్లు తెలుస్తోంది.
ఈ నెల 27న ఏపీ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ వెళ్లనున్నారు. పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సహా రాహుల్ గాంధీతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తారు. ఈ సమావేశంలో షర్మిల అంశం చర్చకు అవకాశం ఉంది. షర్మిల కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఇతర పార్టీల్లోని ముఖ్యనేతలు సైతం హస్తం గూటికి చేరుకుంటారని హైకామండ్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. వైసీపీతో ఉన్నది కాంగ్రెస్ ఓటర్లేనని.. రాజన్న బిడ్డగా షర్మిల బాధ్యతలు తీసుకుంటే వారంత మళ్లా పార్టీ వైపు మళ్లుతారని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ఒకవేళ అన్నీ కుదిరితే కొత్త సంవత్సరం ప్రారంభంలోనే షర్మిల ఏపీ కాంగ్రెస్ చీఫ్ అయ్యే అవకాశాలున్నాయి.