నారా కుటుంబానికి వైఎస్సార్ కుటుంబం స్పెషల్ గిఫ్ట్..
X
ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఏపీ సీఎం జగన్ చెల్లి, వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్కు క్రిస్మస్ కానుకలు పంపారు. ‘‘వైఎస్సార్ కుటుంబం మీకు శుభాకాంక్షలు తెలుపుతోంది. ఈ క్రిస్మస్ ఆనందమయంగా సాగిపోవాలి. మీకు 2024లో అంతా శుభం కలగాలి’’ అంటూ షర్మిల సందేశం పంపారు. ఈ విషయాన్ని లోకేష్ స్వయంగా తెలిపారు. దీనిపై షర్మిలకు స్పెషల్ థ్యాంక్స్ తెలిపారు. ‘‘ప్రియమైన షర్మిల గారూ.. మీ అద్భుతమైన క్రిస్మస్ కానుకలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. నారా ఫ్యామిలీ.. మీకు, మీ కుటుంబానికి క్రిస్మస్తో పాటు, నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలుపుతోంది’’ అని లోకేష్ ట్వీట్ చేశారు.
మరోవైపు దేశవ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. ఆదివారం అర్ధరాత్రి తరువాత చర్చీల్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మెదక్‌లోని ప్రపంచ ప్రఖ్యాత సీఎస్‌ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఏసుక్రీస్తు జన్మవృత్తాంతాన్ని తెలిపే పశువుల పాక, క్రిస్మస్ ట్రీ, పునరుత్థానానికి చిహ్నంగా ఏర్పాటు చేసిన నక్షత్రాలతో చర్చి కొత్త శోభ సంతరించుకున్నది. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి,బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సహా పలువురు ప్రముఖులు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.