YS Sharmila : తల్లి విజయమ్మతో కలసి సోదరుడి నివాసానికి షర్మిల
X
వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) మరికాసేపట్లో తన సోదరుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలవనున్నారు. బుధవారం తల్లి విజయమ్మతో కలిసి తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసానికి షర్మిల వెళ్లనున్నారు. కుటుంబసభ్యులతో కలిసి మంగళవారం ఇడుపులపాయకు వచ్చిన వైఎస్ షర్మిల.. ప్రత్యేక విమానంలో గన్నవరం వెళ్లి , అక్కడ నుంచి తాడేపల్లిలోని సీఎం నివాసానికి చేరుకోనున్నారు. కుమారుడు రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను సోదరుడికి అందజేయనున్నట్లు తెలుస్తోంది. అనంతరం సాయంత్రం విజయవాడ నుంచి షర్మిల ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నట్లు సమాచారం.
షర్మిల కుమారుడు రాజారెడ్డికి వివాహం నిశ్చయమైన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 17వ తేదీన అట్లూరి ప్రియతో కుమారుడి వివాహం నిశ్చయించినట్లు షర్మిల స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ నేపథ్యంలో జనవరి 18వ తేదీన వీరి నిశ్చితార్థ వేడుకను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగానే మంగళవారం కుటుంబ సమేతంగా కాబోయే వధూవరులతో కలిసి ఇడుపులపాలోని వైఎస్సార్ ఘాట్‌ను షర్మిల సందర్శించారు. తొలి ఆహ్వాన పత్రికను అక్కడ ఉంచి తండ్రి ఆశీస్సులు తీసుకున్నారు.