Y. S. Sharmila : జగన్కు షర్మిల లేఖ.. మోసం చేస్తే ఊరుకోమంటూ..
X
(Y. S. Sharmila) ఏపీ కాంగ్రెస్ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన నుంచి వైఎస్ షర్మిల దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ప్రత్యేక హోదా, విభజన సమస్యలపై ఇప్పటికే ఢిల్లీలో దీక్ష చేశారు. అటు వైసీపీ, ఇటు టీడీపీలపై విమర్శలు గుప్పిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో జగన్, చంద్రబాబులకు ఆమె లేఖ రాశారు. విభజన సమస్యలు, ప్రత్యేక హోదాపై కలిసిపోరాడుదామని లేఖలో కోరారు. ‘‘ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు’’ తీర్మానం చేసి కేంద్రానికి, రాష్ట్రపతికి పంపాలని ఈ లేఖల్లో డిమాండ్ చేశారు.
ఏపీ విభజన హామీల అమలు 5.5 కోట్ల ప్రజల హక్కు అని.. వాటిని విస్మరించి, నిర్లక్ష్యం చేసి, రాష్ట్రాన్ని ఇంకా మోసం చేస్తూనే ఉంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదుని షర్మిల అన్నారు. గడిచిన పదేళ్లలో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా విభజన హామీలను విస్మరించడం సిగ్గుచేటని విమర్శించారు. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ.. బీజేపీతో పొత్తులో ఉండి కూడా ప్రత్యేక హోదాను సాధించలేకపోయిందని మండిపడ్డారు.
ఇకపై నిబద్ధతతో విభజన హామీలపై కలిసి పోరాడదామని షర్మిల పిలుపునిచ్చారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రంకోసం నిలబడాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర భవిష్యత్తే ముఖ్యమని స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, విశాఖ కేంద్రంగా నూతన రైల్వే జోన్, రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు వెనకబడిన ప్రాంతాలకు నిధులు, కడపలో ఉక్కు ఫ్యాక్టరీ, విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్, కొత్త రాజధాని నగర నిర్మాణం వంటి అమలుకాని హామీలపై పోరాటానికి ముందుకు రావాలని లేఖలో షర్మిల కోరారు.