YV Sunbbareddy: ఉమ్మడి రాజధాని గడువు పొడిగించాలి .. వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి
X
వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. విశాఖలో పాలనా రాజధాని ఏర్పాటయ్యే వరకు దీన్ని అమలు చేయాలన్నారు. గడువు పొడిగింపు కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. రాజ్యసభలోనూ దీనిపై చర్చిస్తామన్నారు. కాగా జూన్‌తో ఉమ్మడి రాజధాని గడువు ముగియనుంది. అటు వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా వైవీ సుబ్బారెడ్డి సోమవారం నామినేషన్ వేశారు.
నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా నిన్న కూడా .. ఏపీలో ప్రస్తుతం రాజధాని నిర్మాణం చేపట్టే పరిస్థితి లేదని అభిప్రాయపడ్డారు. కేంద్రంలో ప్రభుత్వం బలంగా ఉన్నంత వరకూ ప్రత్యేక హోదా తేవడం కూడా కష్టమేనని చెప్పారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేయాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో సత్సంబంధాలు అవసరమని చెప్పారు. ప్రత్యేక హోదా సహా విభజన హామీల అమలుపై రాజ్యసభలో కేంద్రం మీద ఒత్తిడి తెస్తామన్నారు. అలాగే వైజాగ్‌లో పరిపాలన రాజధాని ఏర్పాటుచేసేంత వరకూ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ అంశంపై కేంద్రంతో చర్చిస్తామని అన్నారు.