Kuruva Gorantla Madhav : ‘చంద్రబాబు చస్తాడు’ అన్న వ్యాఖ్యలపై YCP ఎంపీ వివరణ
X
వంద గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలి వానకి కూలినట్లు.. అలాంటి రాబందు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులొ పడిందంటూ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యాఖ్యానించారు. 2024లు ఎన్నికల్లో వైసీపీ తుఫాను వస్తుందని.. ఆ తుఫానులో టీడీపీ అధినేత కొట్టుకుపోతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆదివారం గోరంట్ల మాధవ్ మీడియాతో మాట్లాడారు. మరోవైపు 2024 ఎన్నికల అనంతరం చంద్రబాబు చస్తాడు అంటూ సామాజిక సాధికార యాత్రలో చేసిన వ్యాఖ్యలపై హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వివరణ ఇచ్చారు. వచ్చే ఎన్నికల అనంతరం చంద్రబాబు రాజకీయంగా చస్తారు అన్నదే తన ఉద్దేశం అని వివరణ ఇచ్చారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజకీయంగా సమాధి అవుతారనే ఉద్దేశంతోనే వ్యాఖ్యలు చేసినట్లు తెలిపారు. వ్యాఖ్య నిర్మాణంలో తప్పులు దొర్లాయని..శబ్ధంలో ఉచ్చరణ దోషంతో తాను చేసిన వ్యాఖ్యలు టీడీపీకి తప్పుగా కనిపిస్తోందని అన్నారు. తన వ్యాఖ్యలపట్ల టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని ఎంపీ గోరంట్ల మాధవ్ ఆరోపణలు చేశారు. వచ్చే ఎన్నికల్లో రాజకీయంగా టీడీపీకి పుట్టగతులు ఉండవని అన్నారు. తన ఉద్దేశాన్ని టీడీపీ వక్రీకరించిందని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ కనుమరుగు అయిపోవడం ఖాయమని చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 నియోజకవర్గాల్లో గెలుపొందడం పక్కా అంటూ ధీమా వ్యక్తం చేశారు.
గోరంట్ల మాధవ్ గతంలో పోలీస్ అధికారిగా పనిచేశారు. సీఐగా ఉన్నప్పటి నుంచే ఆయన వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్నారు. సీఐగా ఉన్నప్పుడే మాధవ్, మీసం మెలేసి నాటి అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై సవాల్ విసిరారు . మాధవ్ ఆ తరువాత వైసీపీలో చేరి ఎంపీగా గెలిచారు. ఆ తరువాత కూడా వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తూనే వస్తున్నారు.