ఉల్లి ధరలపై ఇంటలిజెన్స్ హెచ్చరిక
X
మార్కెట్లో పెరుగుతున్న ధరలతో సామాన్య ప్రజలు కూరగాయలు కొనలేని పరిస్థితి నెలకొంది. నిత్యం వంటల్లో వినియోగించే కూరగాయలకు సైతం డిమాండ్ పెరగడంతో ధరలు చుక్కలనుతాకుతున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు, భారీ వర్షాల కారణంగా పంటంతా నష్టపోవడంతో మార్కెట్లకు కూరగాయల సరఫరాలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఏ కూరగాయ ముట్టుకున్నా కిలో వందకు దగ్గరగా ఉండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టమాటా, మిర్చి విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టమాటా ధర రెండు సెంచరీలకు దగ్గరగా ఉండటంతో చాలా మంది సామాన్య ప్రజలు దానిని కొనేందుకే భయపడిపోతున్నారు. అయితే తాజాగా టమాటా బాటలోనూ ఉల్లి వచ్చి చేరే అవకాశం ఉందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ నెల చివరి కల్లా ఉల్లి ధరలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
ఉల్లి రేట్లు ఈ జులై నెలాఖరు వరకు పెరుగుతూ సెప్టెంబరు నెల నాటికి కిలో రూ.60-70 వరకు పలకవచ్చని ‘క్రిసిల్ మార్కెట్ ఇంటలిజెన్స్ అండ్ అనలిటిక్స్’ తెలిపింది. అయితే 2020 నాటి గరిష్ఠాల దిగువనే ఉల్లి ధరలు ఉంటాయిని చెప్పింది. ఆగస్టు నెల చివరి నాటికి ‘సరఫరా-డిమాండ్ లో అసమతౌల్యం ప్రతిబింబించే అవకాశం ఉందని తెలిపింది. ఇక రబీ ఉల్లి నిల్వ కాలం 1-2 నెలలు తగ్గడంతో ఆగస్టు చివరికే ఉల్లి నిల్వ తగ్గుముఖం పట్టనున్నట్లు పేర్కొంది. దీంతో సెప్టెంబరు ధరలు మరింతగా పెరగవచ్చ తన విశ్లేషణలో తెలిపింది. అక్టోబరు నుంచి ఖరీఫ్ పంట అందుబాటులోకి వస్తే ఉల్లి ధరలు తగ్గుతాయని తన నివేదికలో పేర్కొంది. అలా తగ్గిన ఉల్లి ధరలు డిసెంబర్ వరకు స్థిరంగా కొనసాగుతాయని అంచనా. తృణ ధాన్యాలు, పప్పు ధాన్యాలు, ఇతర కూరగాయల ధరలతో సతమతమవుతున్న వినియోగదారులకు ఈ ఏడాది మే వరకు ఉల్లి ధర కాస్త ఊరట కలిగించింది.