Home > ఆంధ్రప్రదేశ్ > అభ్యర్థులకు అలర్ట్.. ఆగస్ట్ 2 నుంచి గ్రూప్ - 1 ఇంటర్వ్యూలు

అభ్యర్థులకు అలర్ట్.. ఆగస్ట్ 2 నుంచి గ్రూప్ - 1 ఇంటర్వ్యూలు

అభ్యర్థులకు అలర్ట్.. ఆగస్ట్ 2 నుంచి గ్రూప్ - 1 ఇంటర్వ్యూలు
X

గ్రూప్ - 1 అభ్యర్థులకు సంబంధించి ఏపీపీఎస్సీ కీలక ప్రకటన చేసింది. ఆగస్ట్ 2 నుంచి జనరల్, స్పోర్ట్స్ కోటా కింద ఎంపికైన వారికి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. గ్రూప్ 1 మౌఖిక పరీక్షకు ఎంపికైన అభ్యర్థుల లిస్టును ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుక్రవారం రిలీజ్ చేసింది. నోటిఫికేషన్ లో చెప్పినట్లుగా పోస్టులకు అనుగుణంగా అభ్యర్థులను ఎంపిక చేసినట్లు అధికారులు చెప్పారు. వచ్చే నెల 2వ తేదీ ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విజయవాడ ఎంజీ రోడ్డులోని ఏపీపీఎస్సీ ఆఫీసులో ఇంటర్వ్యూలు జరుగుతాయని స్పష్టం చేశారు.

స్పోర్ట్స్‌ కోటాలో ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 27 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని ఏపీపీఎస్సీ ప్రకటించింది. గతేడాది సెప్టెంబర్ 30న 111 గ్రూప్‌–1 పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేసిన కమిషన్.. ఈ ఏడాది జనవరి 8న ప్రిలిమ్స్‌ నిర్వహించింది. అదే నెల 27న ఫలితాలను ప్రకటించింది. 5,035 మంది మెయిన్స్‌ ఎగ్జామ్ కు ఎంపికకాగా వారికి జూన్‌ 3 నుంచి 10 వరకు పరీక్షలు నిర్వహించారు. అందులో అర్హత సాధించిన వారిలో పోస్టుకు ఇద్దరు చొప్పున 110 పోస్టులకు 220 మందిని, స్పోర్ట్స్‌ కోటాలోని ఒక పోస్టుకు 39 మందిని అధికారులు ఇంటర్వ్యూకు సెలెక్ట్ చేశారు.

ఏపీపీఎస్సీ గ్రూప్ -1 నియామకాల విషయంలో రికార్డు సాధించింది. ప్రిలిమ్స్‌ పూర్తైన 19 రోజుల్లో, మెయిన్స్‌ పరీక్షలు జరిగిన అనంతరం 33 రోజుల్లోనే ఫలితాలను వెల్లడించింది. నోటిఫికేషన్ జారీ అయిన అనంతరం అతి తక్కువ సమయంలో ఎలాంటి వివాదాలకు తావులేకుండా పరీక్షలు నిర్వహించడంతో పాటు ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు సిద్ధం కావడం ఏపీపీఎస్సీ చరిత్రలోనే ఇదే తొలిసారి కావడం విశేషం.

Updated : 15 July 2023 1:27 PM IST
Tags:    
Next Story
Share it
Top