గ్రూప్ 1 అభ్యర్థుల బయోమెట్రిక్ సేకరించకపోవడంపై హైకోర్టు ఆగ్రహం
X
టీఎస్‌పీఎస్సీ పరీక్షల నిర్వాహణపై వివాదాలు న డుస్తూనే ఉన్నాయి. పేపర్ లీక్ కారణంగా రద్దైన పరీక్షలను త్వరగా పూర్తి చేయాలని టీఎస్‌పీఎస్సీ భావిస్తోంది. అయితే ఈక్రమంలో కొత్త తలనొప్పులు ఎదురవతున్నాయి. ఇటీవల నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షను రద్దు చేయాలంటూ హైకోర్టులో పలు పిటిషన్లు జారీ అయిన సంగతి తెలిసిందే. పరీక్ష నిర్వాహణలో లోపాలను ప్రస్తావిస్తూ పిటిషన్ దాఖలు చేశారు.
అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకోకుండా పరీక్ష నిర్వహించారని, ఓఎంఆర్ షీట్‌పై అభ్యర్థుల హాల్‌టికెట్ నంబర్, ఫొటో లేదని పలువురు అభ్యర్థుల వేసిన పిటిషన్‌పై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. పరీక్షల్లో అక్రమాలకు అడ్డుకట్టే వేసే అంశాలను గాలికొదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓఎంఆర్ షీటుపై హాల్‌టికెట్ నంబరు, ఫోటో ఎందుకు లేవని టీఎస్పీఎస్సీని ప్రశ్నించింది. అభ్యర్థుల బయోమెట్రిక్ సేకరించకపోవడంపై కూడా మండిపడింది. టీఎస్‌పీఎస్సీ బదులిస్తూ.. బయోమెట్రిక్, ఓఎంఆర్‌పై ఫోటోకు రూ.1.50 కోట్లు ఖర్చవుతుందని వివరణ ఇచ్చింది. మూడు వారాల్లో కౌంటరు దాఖలు చేయాలని టీఎస్పీఎస్సీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.