ఇండియన్ మెడికల్ స్టూడెంట్స్కు గుడ్ న్యూస్..ఇకపై విదేశాల్లోనూ..
X
మెడికల్ స్టూడెంట్స్కు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. విద్యార్థులు ఇకపై విదేశాల్లో కూడా ప్రాక్టీస్ చేయొచ్చని కేంద్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఈ మేరకు వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్ నుంచి జాతీయ వైద్యమండలికి గుర్తింపు లభించింది. దీంతో భారత్‌లో వైద్య విద్య చదివిన వారు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాతో పాటు న్యూజిలాండ్ వంటి దేశాల్లో పీజీ కోర్సుల్లో చేరడంతో పాటు ప్రాక్టీస్ చేయొచ్చని ఆరోగ్యశాఖ వివరించింది. 2024 నుంచి విద్యార్థులు విదేశాల్లో విద్య, ప్రాక్టీస్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది.
ప్రస్తుతం దేశంలో ఉన్న మెడికల్ కాలేజీలకు డబ్ల్యూఎఫ్‌ఎమ్‌ఈ గుర్తింపు పొందుతాయని కేంద్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో 706 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ‘‘ఈ వెసులుబాటుతో ఇండియన్ మెడికల కాలేజీలకు, నిపుణులకు అంతర్జాతీయంగా గుర్తింపు లభిస్తుందని ఆరోగ్యశాఖ అభిప్రాయపడింది. విదేశాల్లోని వైద్య విద్యాసంస్థలకు భారత్‌లోని కాలేజీల మధ్య సంబంధాలు మెరుగుపడతాయని ఎన్‌ఎమ్‌సీ ప్రతినిధి డాక్టర్ యోగేందర్ మాలిక్ తెలిపారు. వైద్య విద్యలో సరికొత్త ఆవిష్కరణలకు ఇది తోడ్పాటునందిస్తుందని చెప్పారు.
భారత్‌లో అందించే వైద్య విద్య అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉందనేందుకు WFME గుర్తింపే నిదర్శనమని యోగేందర్ అన్నారు. దీని వల్ల భారతీయ వైద్య విద్యార్థులు ప్రపంచంలో ఎక్కడైనా తమ కెరీర్‌ను కొనసాగించవచ్చని స్పష్టం చేశారు. కాగా అంతర్జాతీయంగా అత్యున్నతస్థాయి ప్రమాణాలతో వైద్య విద్యను అందించేందుకు WFME కృషి చేస్తోంది. WFME గుర్తింపు కావాలంటే ప్రతి మెడికల్ కాలేజీ 60 వేల డాలర్లు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇక దేశంలోని 706 మెడికల్ కాలేజీలకు WFME గుర్తింపు కోసం సుమారు 4,23,60,000 డాలర్లు ఖర్చు కానుంది.